
దంచికొట్టి.. దడపుట్టించి
వరుణుడి కుండపోతకు పల్లెలు, పట్టణాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఏకధాటి వర్షాలతో వాగులు వంకలు జల ప్రవాహంతో ఉరకలెత్తుతున్నాయి. చెరువులు అలుగు పోస్తున్నాయి. పంట పొలాలు నీట మునిగి, రైతన్నకు నష్టాన్ని మిగిల్చాయి. రహదారులు, కల్వర్టులు దెబ్బతిని వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
కొడంగల్/కొడంగల్ రూరల్/దుద్యాల్/ దౌల్తాబాద్: జిల్లాలోని పలు మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. ఆదివారం రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా పడింది. కొడంగల్ మండలంలో 5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. చెరువులు, కుంటలు అలు గు పారుతున్నాయి. పలు గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. హుస్సెన్‌పూర్ రోడ్డు వరద ఉధృతికి కోసుకు పోయింది. పర్సాపూర్‌లో ప్రధాన రహదారిపై బురదలో వాహనాలు దిగబడ్డాయి. అంగడిరాయిచూర్ వాగు జోరుగా ప్రవహిస్తోంది. కొడంగల్ బైపాస్ నిర్మాణం కోసం వేసిన మట్టి వర్షం దాటికి కొట్టుకొని పోయింది. మండలంలోని ర్యాలపేట చెరువుకు గండి పడింది. విషయం తెలుసుకున్న స్థానికులు గండిని పూడ్చడానికి ప్రయత్నించారు. ఇరిగేషన్ అధికారులు గండిని పూడ్చారు. దుద్యాల్ మండలంలో ఆదివారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండగా.. చెరువులు ఆలుగు పారుతున్నాయి. కుదురుమల్ల గ్రామ సమీపంలో వాగుపై వంతెన నిర్మాణం కోసం తెచ్చిన ఇటాచీ, కాంక్రీట్ మిక్సింగ్ మిషన్ నీటి మధ్యలో ఇరుక్కుపోయాయి. దుద్యాల్ గేటు వద్ద నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ చుట్టూ నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దౌల్తాబాద్ మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. చాలా గ్రామాల్లో బీటీ రోడ్లు ధ్వంసమయ్యాయి. మట్టి రోడ్లు కోసుకుపోయాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇండాపూర్ – కుదురుమళ్ల మధ్య వాగు ఉధృతంగా పారడంతో రాకపోకలు స్తంభించాయి. గుముడాల – బిచ్చాల రోడ్డు ధ్వంసమైంది. దేశాయిపల్లి, దౌల్తాబాద్ గ్రామాల మధ్య ఉన్న చింతల్ చెరువు పారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. యాంకి గ్రామంలో చెరువు కింద పంట లు నీట మునిగి పోవడంతో రైతులు నష్టపోయారు.
వరుణుడి బీభత్సం.. రాత్రికిరాత్రే అతలాకుతలం
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
అలుగుపోస్తున్న చెరువులు, కుంటలు
నీటమునిగిన పంటపొలాలు, దెబ్బతిన్న రోడ్లు
స్తంభించిన రవాణా,అస్తవ్యస్తంగా జనజీవనం