
జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లా కన్వీనర్ రాజ్‌కుమార్
మోమిన్‌పేట: రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల్లో పాల్గొనాలని జిల్లా కన్వీనర్లు రాజ్‌కుమార్, వాజయ్ శ్రవణ్‌కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలకు అర్హులన్నారు. రాష్ట్ర కమిటీ ఎంపిక చేసిన బమ్మెర పోతన, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతు, వట్టికోట అళ్వార్‌స్వామి, వానమామలై వరదాచార్యులు, సురవరం ప్రతాప్‌రెడ్డి, సామల సదాశివ, బోయ జంగయ్య, పాకాల యశోద, కాళోజీ నారాయణరావు, డాక్టర్ సి.నారాయణరెడ్డి కవుల గురించి వ్యాసం రాయాల్సి ఉంటుందని చెప్పారు. పాఠశాల స్థాయిలో వ్యాసరచన పోటీలు నిర్వహించి ఉత్తమంగా రాసిన ఒక బాలిక, ఒక బాలుడి వ్యాసాలను జిల్లా స్థాయికి పంపాలన్నారు. జిల్లా స్థాయికి వచ్చిన 50 వ్యాసాల నుంచి ఐదుగురిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేయాలన్నారు. అక్టోబర్ 6వ తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఉన్నత పాఠశాలల విద్యార్థులు అందరూ ఈ పోటీల్లో పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. ఇతర వివరాలకు 98667 50134, 84668 23975 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య
దుద్యాల్: మండల పరిధిలోని పోలేపల్లి గ్రామంలో స్వయంభుగా వెలిసిన రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మెరుగు వెంకటయ్య అన్నారు. ఆదివారం ఆయన రూ.75 లక్షలతో ఆలయ ప్రాంగణం చుట్టూ నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ.. కడా ప్రత్యేక నిధులతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. పల్లెలు, పట్టణాలతో పాటు ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. కొడంగల్ వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి సైతం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ జయరాములు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి: తాగిన మత్తులో పలువురు యువకులు బస్సు డ్రైవర్‌పై దాడి చేశారు. ఈ ఘటన వికారాబాద్ సమీపంలోని అనంతగిరిగుట్టలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన ప్రకారం.. తాండూరు నుంచి వికారాబాద్ ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సుకు అనంతగిరి ఆలయం సమీపంలో కొందరు యువకులు కారు అడ్డుపెట్టారు. అంతటితో ఆగకుండా డ్రైవర్ సత్తయ్యను దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నారు. ఎంత సముదాయించినా పట్టించుకోకుండా యువకులు హల్చల్ చేశారు. దీంతో ప్రయాణికులు వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. డ్రైవర్ సత్తయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి యువకులను అదుపులోకి తీసుకున్నారు.
శంకర్‌పల్లి: ఆత్మరక్షణకు ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేటు గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించిన 1వ దక్షిణ భారత కరాటే చాంపియన్‌షిప్ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ విభాగాల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక ధృడత్వంతో పాటు మానసికోల్లాసం కలుగుతాయన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ నాయకులు వైభవ్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.

జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు