
నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
అనంతగిరి: పట్టణంలోని ఆలంపల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలో వెలిసిన వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో సోమవారం నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాల(శ్రీవారి రజతోత్సవ బ్రహ్మోత్సవాలు)కు ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ధర్మకర్తల మండలి ప్రతినిధులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8గంటలకు ధ్వజారోహనంతో ప్రారంభం కానున్నాయి. నిత్యం ఉదయం 5గంటలకు సుప్రభాత సేవ, 5.30 గంటలకు మహాభిషేకం, 7 గంటలకు నైవేద్యం, మంగళహారతి, 8గంటలకు అర్చనలు, స్వామి వారి దర్శనం, 10 గంటలకు శ్రీవారి కల్యాణం, మధ్యాహ్నం 12.30 గంటలకు నైవేద్యం, మంగళహారతి, తీర్థప్రసాద వితరణ, ఒంటిగంటలకు మహాప్రసాదం, సాయంత్రం 4గంటలకు విష్ణు లలితా సహస్రనామ పారాయణం, 5గంటలకు మహిళల భజన, 6 గంటలకు వాహనసేవలు, 6.30 గంటలకు ఊయల సేవ అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. గురువారం శమీ పూజ, చక్రస్నానం, ధ్వజ అవరోహనంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు లక్ష్మీనారాయణ కోరారు.