
పశు సంరక్షణపై ఆందోళన
తాండూరు రూరల్: పశువైద్య శాఖ అధికారుల తీరుపై తాండూరు ఏఎంసీ చైర్మన్ పి.బాల్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఆయన స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలోని పశువైద్య ఏడీఏ కార్యాలయాన్ని సందర్శించారు. గంటపాటు అక్కడే ఉన్నా వైద్యులు ఎవరూ రాలేదు. ఈ సందర్భంగా బాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏడీఏ కార్యాలయంలో ఇన్‌చార్జిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ నోవా కొన్ని నెలలుగా రైతులకు అందుబాటులో ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని సాయిపూర్, మల్‌రెడ్డిపల్లి, పాంత తాండూరు పాటు పలు కాలనీల రైతులు పశు వైద్యులు లేక జీవాలకు సరైన వైద్యం అందడం లేదని ఫిర్యాలు చేస్తున్నారన్నారు. ఈ మేరకు కార్యాలయానికి రావడంతో సిబ్బంది మల్లికార్జున్ మినహాయిస్తే ఎవరూ లేరన్నారు. రోగాలు వ్యాప్తి చెంది పశువులు మృత్యువాత పడుతున్నా అధికారులు పట్టించుకోక పోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఇదే విషయమై జిల్లా పశువైద్యశాఖ అధికారి డాక్టర్ సదానందంను ఫోన్‌లో సంప్రదించారు. డాక్టర్ల తీరుపై స్థానిక ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
వైద్యాధికారుల తీరుపై ఏఎంసీ చైర్మన్ అసంతృప్తి