
డీఫాల్టర్లకు ధాన్యం బంద్
జిల్లాలో 30 మిల్లులకు నోటీసులు రూ.20 కోట్ల ఫెనాల్టీ
రెండేళ్లుగా పౌరసరఫరాల శాఖకు బియ్యం ఇవ్వని మిల్లర్లు
తాండూరు: పౌరసరఫరాల శాఖ రైస్ మిల్లర్లకు సీఎంఆర్ కింద ఇచ్చిన ధాన్యాన్ని జిల్లాలోని కొందరు రైస్ మిల్లర్లు పక్కదారి పట్టించారు.కోవిడ్ సమయంలో లాక్‌డౌన్‌ను అదునుగా చేసుకొని పేదలకు పంపిణీ చేసే బియ్యంతో అక్రమాలకు పాల్పడ్డారు. రైస్ మిల్లుల యజమానులు గడువులోపు అందించకపోవడంతో 30 మంది నిర్వాహకులకు అధికారులు నోటీసులు జారీ చేసి రూ.20 కోట్లు జరిమానా విధించారు. ఈ వానాకాలంలో రైతుల నుంచి సేకరించే ధాన్యాన్ని డీఫాల్టర్‌లకు ఇవ్వొద్దని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
రీసేల్
జిల్లాలోని 20 మండలాల్లో రైతులు వరి సాగు చేపట్టారు. సాగునీటి వనరులు మెరుగుపడడంతో ఎనిమిదేళ్లుగా సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, బోరు మోటార్ల కింద వరిసాగు వానాకాలంలో 1.20 లక్షల ఎకరాలు, యాసంగిలో సుమా రు 80 వేల ఎకరాల వరకు సాగవుతోంది. ఈ ధాన్యాన్ని ఏటా ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తోంది. పౌరసరఫరాల శాఖ ఆధీనంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. సేకరించిన ధాన్యాన్ని ప్రజా పంపిణీ కోసం సీఎంఆర్ చేసేందుకు రైస్ మిల్లులకు తరలిస్తారు. కాగా 2021–22, 2022–23 ఆర్థిక సంవత్సరాల్లో తరలించిన ధాన్యం మిల్లర్లు గడువు ముగిసినా అందించలేదు. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు విచారణ చేపట్టారు.మిల్లుల్లోకి వెళ్లి తనిఖీలు చేపట్టగా ధాన్యం కనిపించలేదు. ఇటువంటి 30 మంది రైస్ మిల్లుల యజమానులకు నోటీసులు జారీ చేయడంతో పాటు రూ.20 కోట్లు చెల్లించాలని గతంలో నోటీసులు జారీ చేశారు. కొందరిపై క్రిమినల్ కేసులు సైతం నమోదు చేశారు.
సీఎంఆర్ ధాన్యం అమ్మకాలు
రైతుల నుంచి ప్రభుత్వ మద్ధతు ధరకు కొనుగోలు చేసి సీఎంఆర్ కోసం రైస్ మిల్లులకు అప్పగించిన ధాన్యాన్ని మిల్లు యజమానులు తాండూరు వ్యవసాయ మార్కెట్‌లో విక్రయించారనే ఆరోపణలున్నాయి. తాండూరు వ్యవసాయ మార్కెట్లో ఏటా 40 వేల నుంచి ఆరువేల క్వింటాళ్లు మాత్రమే ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయి. కానీ 2023లో మార్కెట్ యార్డులో 4 లక్షల క్వింటాళ్లు విక్రయాలు జరిగాయి. మార్కెట్‌కు వచ్చిన ధాన్యం రైస్ మిల్లర్లు రైతుల పేరిట విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి.
అధికారుల నిర్ణయం ఫైనల్
పౌరసరఫరాల శాఖకు 30 రైస్ మిల్లులు సీఎంఆర్ ఇవ్వలేదు. దీంతో మిల్లు యజమానులను డిఫాల్టర్ల జాబితాలో చేర్చి నోటీసులు జారీ చేశారు. 30 మిల్లు ల యజమానుల నుంచి రూ.20 కోట్ల వరకు పెనాల్టీ విధించాం. డిఫాల్టర్లకు ఈ సీజన్‌లో సీఎంఆర్ అందించే విఽషయంలో ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారు.
– మోహన్‌కృష్ణ, డీఎం, పౌరసరఫరాల శాఖ