
కిశోర బాలికలతో ఎస్‌హెచ్‌జీలు
జిల్లా వ్యాప్తంగా 70 వేల సంఘాలు ఏర్పాటు చేయాలి స్నేహ యాప్‌లో వివరాలు నమోదు చేయాలి డీఆర్‌డీఏ శ్రీనివాస్
తాండూరు రూరల్: గ్రామాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల తరహాలో కిశోర బాలికల సంఘాలను ఏర్పాటు చేయాలని డీఆర్‌డీఏ శ్రీనివాస్ ఆదేశించారు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట్ మండలాల్లోని ఐకేపీ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌డీఏ శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 14 ఏళ్ల నుంచి 18 సంవత్సరాల బాలికలతో 70 వేల కిషోర బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు. మహిళ జీవితంలో కిషోర బాలిక దశ కీలకమైనదని.. వారికి సరైన దారి చూపితే సమాజానికి మార్గదర్శకురాలు అవుంతుందన్నారు. సంఘాలు ఏర్పాటు తర్వాత బాలికల భద్రత, ఆరోగ్యం, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ప్రభుత్వం సహాకరిస్తోందని వివరించారు. స్నేహ యాప్‌లో కిషోర బాలికల వివరాలు నమోదు చేయాలని సూచించారు. వృద్ధులు, దివ్యాంగుల సంఘాలు సైతం ఏర్పాటు చేయాలన్నారు. నవంబర్ 20వ తేదీలోపు అన్ని సంఘాల ఏర్పాటు పూర్తి చేయాలని ఐకేపీ సిబ్బందిని ఆదేశించారు. ఎన్‌ఆర్‌ఎల్‌ఎం(నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్) పథకం కింద గొర్రెలు, మేకల పెంపకం యూనిట్లు మంజూరయ్యాయని చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ నర్సింలు, డీపీఎంలు నర్సింలు, కొమరయ్య, మ హిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు జానకి, శ్రీనిధి ఆర్‌ఎం ఉదయ్‌కుమారి, ఏపీఎంలు బాలయ్య, శ్రీనివాస్, పద్మారావు, గోపాల్, వెంకన్న, బందెయ్య, సీసీలు పాల్గొన్నారు.