
మట్టి తవ్వకాలకు అనుమతులా?
● కేవీపీఎస్ మండల అధ్యక్షుడు సురేశ్ మండిపాటు
● రైతుల నుంచి తీసుకున్న భూములకు పరిహారం ఇవ్వాలి
ఇప్పట్లో ‘దారి’కొచ్చేనా..!
చిత్రంలో కనిపిస్తున్నది వరదనీటి కాలువ అనుకుంటే మీరు గుంతలో కాలేసినట్లే. ఇది అక్షరాలా ఆర్‌అండ్‌బీ ప్రధాన రోడ్డు. బషీరాబాద్‌లోని పశువుల దవాఖానా నుంచి అంబేడ్కర్ ప్రధాన కూడలి మీదుగా పాత బీఎస్‌ఎన్‌ఎల్ భవనం వరకు రహదారి దుస్థితి ఇలా తయారైంది. విస్తరణ పనుల్లో భాగంగా పది రోజుల క్రితం రోడ్డును తవ్విన కాంట్రాక్టర్ అలాగే వదిలేయడంతో భారీ వర్షాలకు నీళ్లు నిండి ఏటి కాలువను తలపిస్తోంది. మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రోడ్డు ఇలా మారడంతో ప్రయాణికులు, స్థానికులు అవస్థలు పడుతున్నారు. – బషీరాబాద్
బషీరాబాద్: దళితులకు ఇచ్చిన భూముల్లో మట్టి తవ్వకాలకు ఎలా అనుమతులు ఇస్తారని అధికారులపై కేవీపీఎస్ మండల అధ్యక్షుడు సురేశ్ మండిపడ్డారు. ఐదు దశాబ్దాల కిందటా అప్పటి దివంగత ఇందిరమ్మ ప్రభుత్వంలో దళితులకు సీలింగ్‌పట్టాలు ఇస్తే, వాటిని సదరు వ్యక్తులకు తెలియకుండానే అధికారులు లాక్కున్నారని సురేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని నావంద్గీ గ్రామానికి చెందిన 60దళిత కుటుంబాలకు సర్వేనంబర్ 182, 183లో 60 ఎకరాల అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చారు. ఈ విషయం గురించి రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు తిరిగి లాక్కున్నారన్నారు. నాటి ఇందిరమ్మ కాలంలో భూములు పంపిణీ చేస్తే నేటి రేవంత్‌రెడ్డి ప్రజా పాలనలో దళితుల భూములు గుంజుకున్నారని విమర్శించారు. ఆ భూముల్లో ప్రైవేట్ వ్యక్తులకు మట్టి తవ్వకాల కోసం రెవెన్యూ అధికారులు ఎలా అనుమతులు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి పేరుతో రైతుల నుంచి తీసుకున్న భూములకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండా లాక్కోవడం అన్యాయమన్నారు. వెంటనే సదరు భూముల్లో మట్టి తవ్వకాలు నిలిపివేసి, రైతులకు పరిహారం ఇప్పించాలని తహసీల్దార్ షాహెదాబేగానికి వినతిపత్రం అందజేశారు.

మట్టి తవ్వకాలకు అనుమతులా?