
తాండూరు జిల్లా ఆస్పత్రిలో వెంటాడుతున్న వైద్యులు కొరత
50 మంది డాక్టర్లకు గాను 20 మందే..
ఉన్నవారికీ డిప్యూటేషన్ బాధ్యతలు
గంటల తరబడి క్యూలో రోగులు
వికారాబాద్, పరిగి ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి
కొడంగల్‌లో కాస్త మెరుగు
తాండూరు: పేరుకే జిల్లా ఆస్పత్రి.. వైద్య సేవలు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. తాండూరు పట్టణంలోని జిల్లా ఆస్పత్రికి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. వైద్యులు మాత్రం అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సివిల్ సర్జన్లు, డిప్యూటీ సివిల్ సర్జన్లు, స్పెషలిస్టు వైద్యులు 50 మంది వరకు ఉండాలి. కానీ 20మంది మాత్రమే ఉన్నారు. 12కు గాను 7 సివిల్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న ఐదు మందిలో ఒకరు మెదక్ ఆస్పత్రికి డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఎస్‌ఆర్‌ఎంఓ పోస్టు ఖాళీగా ఉంది. 25 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు గాను 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 16 మంది వైద్యులకు గాను 5 మంది ఇతర ఆస్పత్రులకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. డిప్యూటీ సివిల్ సర్జన్లు 8 పోస్టులకు గాను 5 ఖాళీగా ఉన్నాయి. ఉన్న 5 మందిలో ఇద్దరు డిప్యూటేషన్‌పై వెళ్లారు. దీంతో 24 గంటల వైద్య సేవలకు ఇబ్బందికరంగా మారింది.
గంటల తరబడి క్యూలో..
గురువారం ఒక్క రోజే 710 మంది రోగులు వివిధ ఆరోగ్య సమస్యలపై ఆస్పత్రికి వచ్చారు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు ఔట్ పేషెంట్లు క్యూ కట్టారు. రోగుల సంఖ్యకు తగినంత మంది వైద్యులు లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. సకాలంలో వైద్యం అందక రోగులు డాక్టర్లతో గొడవకు దిగారు. 12 గంటల తర్వాత ఓపీ సేవలు ఆపేశారు. మాతాశిశు ఆస్పత్రిలో 5 మంది గైనకాలజిస్టులు, 5 మంది చిన్నపిల్లల వైద్యులు ఉండాలి. కానీ అన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఆ రెండు విభాగాల్లో ఇద్దరు వైద్యులు కాంట్రాక్ట్ పద్ధతిన సేవలు అందిస్తున్నారు. గురువారం 435 మహిళలు, చిన్నారులు వైద్య సేవలు పొందారు.
జిల్లాలోని ప్రధాన ఆస్పత్రుల్లో రోగులకు నామమాత్రపు వైద్య సేవలు అందుతున్నాయి. పీహెచ్‌సీల నుంచి మెరుగైన వైద్యం కోసం వచ్చే వారిలో ఎక్కువ మంది ప్రైవేటు బాట పడుతున్నారు. జిల్లాలో నాలుగు పెద్దాస్పత్రులు ఉన్నాయి. అందులో పరిగి, కొడంగల్‌లో కమ్యునిటీ హెల్త్ సెంటర్లు,తాండూరు జనరల్ ఆస్పత్రి, వికారాబాద్‌లో బోధనాస్పత్రి ఉంది. వీటిలో పరీక్షలకు సరిపడా పరికరాలు లేకపోవడం, వైద్యులు నగరం నుంచి వస్తుండటంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఓపీకి అనుకున్నంత మేర రోగులు రావడం లేదు. జిల్లాలోని సీహెచ్‌సీల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలపై గురువారం ‘సాక్షి’ విజిట్ చేసింది. – వికారాబాద్