
విద్యా వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దుతాం
అనంతగిరి: విద్యా వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సమూల మార్పుల కోసం అధ్యయనం చేయడం జరుగుతుందని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, డైట్ కళాశాలలను కమిషన్ సభ్యులు పీఎల్ విశ్వేశ్వరరావు, డాక్టర్ చారుకొండ వెంకటేష్, జ్యోత్స్నా శివారెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మౌలిక వసతులు, బోధన, విద్యార్థుల సంఖ్యపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతులు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామన్నారు. అధ్యాపకులు, గెస్ట్ ఫ్యాకల్టీ సమస్యలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. ఇంగ్లిష్, ఉర్దూ పాఠ్యపుస్తకాలు అందుబాటు లేవని, వసతి గృహంలో సదుపాయాలు కల్పించాలని డైట్ కళాశాల విద్యార్థులు ఆకునూరి మురళిని కోరారు. ఇందుకు ఆయ న సానుకూలంగా స్పందించారు. వెంటనే పాఠ్యపుస్తకాలు అందేలా చూస్తామని పేర్కొన్నారు. డైట్ కళాశాల ఆవరణలో ఉన్న వసతి గృహాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహించేందుకు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శంకర్ నాయక్, డీఈఓ రేణుకాదేవి, ప్రిన్సిపాళ్లు గీతా లక్ష్మీపట్నాయక్, రామాచారి తదితరులు పాల్గొన్నారు.