
నేర నియంత్రణలో భేష్
● పోలీసుల పనితీరు బాగుందని కితాబు
● డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపాలి
● చన్గోముల్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన డీఐజీ తప్సిర్ ఇక్బాల్
పూడూరు: నేరాల నియంత్రణలో జిల్లా పోలీసుల పనితీరు బాగుందని హైదరాబాద్ రేంజ్ డీఐజీ తప్సిర్ ఇక్బాల్ కితాబునిచ్చారు. సాధారణ తనిఖీల్లో భాగంగా మంగళవారం చన్గోముల్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి అడ్డుకట్టకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా పాఠశాలలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలోని వివిధ పరిశ్రమల్లో పని చేసేందుకు వచ్చిన బీహార్, ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కార్మికులు మత్తు పదార్థాలు వాడుతున్నట్లు సమాచారం ఉందన్నారు. వారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. అవసరమైతే పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన లేక ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటి నివారణకు గ్రామాలు, స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్ర మాదకర ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. నేర నియంత్రణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. నేరస్థులకు శిక్ష పడేలా చూడాలని.. అప్పుడే భయం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్పీ నారాయణరెడ్డి, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ భరత్‌రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.