
పులుమద్దిని సందర్శించిన యూపీ బృందం
అనంతగిరి: వికారాబాద్ మండలం పులుమద్ది గ్రామాన్ని మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పంచాయతీరాజ్ విభాగానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, కన్సల్టెంట్లు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపడుతున్న క్లీన్ అండ్ గ్రీన్ పనులను పరిశీలించారు. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ పరిధిలోని పల్లె ప్రకృతి వనం తిలకించి మొక్కలు ఏపుగా, రకరకాల చెట్లు ఉండటాన్ని పరిశీలించి వాటి నిర్వహణపై ఎంపీడీఓ వినయ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తెలంగాణ క్రీడా ప్రాంగణం తిలకించారు. అక్కడి నుంచి గ్రామ పరిసరాల్లోని సోక్‌పిట్స్ పరిశీలించి నిర్వహణ గురించి ఆరా తీశారు. సెగ్రిగేషన్ షెడ్‌లో చెత్త సేకరణ, వేరు చేయడం, నిర్వహణ తెలుసుకున్నారు. గ్రామానికి వస్తున్న ఆదాయ వనరులు, ఖర్చులను గమనించారు. గ్రామంలో చేపడుతున్న శానిటేషన్ పనులను పరిశీలించి రోడ్లను చూసి ఏ పథకం కింద మంజూరయ్యాయని అడిగి తెలుసుకున్నారు. వారి వెంట టీజీఐఆర్‌డీ సీఈఓ అనిల్‌కుమార్, డీఎల్‌పీఓ సంధ్యారాణి, ఎంపీఓ దయానంద్, ఏపీఓ శీను, పంచాయతీ కార్యదర్శి శిల్ప, డీఆర్‌డీఏ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.