యాచారం: ఫార్మా రైతులకు మళ్లీ నోటీసులు జారీ అయ్యాయి. అథారిటీలో జమ చేసిన పరిహారం డబ్బులు ఎందుకు తీసుకోవడం లేదో అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని సీసీఎల్‌ఏ నుంచి వ్యక్తిగత నోటీసులు అందజేస్తున్నారు. అప్పట్లో ఫార్మాసిటీకి స్వచ్ఛందంగా పట్టా భూములిచ్చిన రైతులకు ఎకరాకు రూ.16 లక్షల పరిహారం అందజేశారు. టీజీఐఐసీ పేరు మీద భూరికార్డులు మార్చిన రైతులకు మాత్రం ఎకరాకు రూ.8 లక్షల చొప్పున పరిహారాన్ని అథారిటీలో జమ చేశారు. మీరాఖాన్‌పేటలోని టీజీఐఐసీ మెగా వెంచర్‌లో ఎకరాకు 121 గజాల చొప్పున ప్లాట్లు కూడా కేటాయించారు. హైకోర్టు రైతులకు మద్దతుగా టీజీఐఐసీ పేరు మీదున్న భూ రికార్డులను తిరిగి రైతుల పేర్లపై మార్చాలని తీర్పు ఇచ్చినా అధికారులు లెక్క చేయడం లేదు. తాజాగా సీసీఎల్‌ఏ నుంచి నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల రైతులకు ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నగరంలోని సీసీఎల్‌ఏలో వ్యక్తిగతంగా హాజరు కావాలని వ్యక్తిగత నోటీసులు వచ్చాయి. ‘భూ రికార్డులు మీ పేర్లపై లేనందున ఇక ఆ భూములు మీవి కావని, ఆ భూములపై మీకు హక్కు లేదని.. అథారిటీలో జమ చేసిన డబ్బులే మీవి’ అంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. అథారిటీలో జమ చేసిన డబ్బులు తీసుకోకపోతే ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించాల్సి వస్తుందన్నారు. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.
న్యాయం చేయండి సారూ..
సీసీఎల్‌ఏ నుంచి నోటీసులు అందుకున్న నాలుగు గ్రామాల రైతులు మంగళవారం నగరంలోని రైతు కమిషన్ కార్యాలయంలో రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డిని కలిశారు. మీరే న్యాయం చేయాలని విన్నవించారు. పరిహారం డబ్బులు అథారిటీలో జమ చేసిన విషయం ప్రత్యేక కోర్టు పరిధిలో ఉందని, రైతులకు అన్యాయం జరగ కుండా సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడతానని ఆయ న హామీ ఇచ్చారు. అనంతరం ప్రొఫెసర్ కోదండరాం కలిసిన రైతులు తమ గోడు వెలిబుచ్చారు.