
నెహ్రూతో జాదవ్
నేడు తెలంగాణ విమోచన దినం
నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన రోజు
ఉద్యమంలో జిల్లా వాసులు సైతం..
ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
వికారాబాద్: నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన రోజిది. రజాకార్ల చేతిలో బందీగా ఉన్న తెలంగాణకు విముక్తి కల్పించడానికి ఎంతోమంది అమరులయ్యారు. భారతదేశానికి స్వాతంత్య్రం ఆగస్టు 15, 1947న సిద్ధిస్తే.. సెప్టెంబరు 17, 1948న ఇండియాలో హైదరాబాద్ సంస్థానం విలీనమైంది. ఈ రోజును తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకోవాలనే డిమాండ్ ఎన్నో సంవత్సరాల నుంచి వస్తోంది. కొన్ని పార్టీలు విమోచన దినంగా పేర్కొంటే.. మరికొన్ని విలీన దినంగా.. ఇంకొందరు విముక్తి దినంగా.. మరికొందరు విద్రోహ దినంగా జరుపుకొంటున్నారు. గత ప్రభుత్వం విలీన దినోత్సవంగా వేడుకలు జరపగా.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఈ సారి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. 1948లో సైనిక చర్య ద్వారా తెలంగాణ భారత దేశంలో విలీనం కాగా.. 1952లో మొదటి సారి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించారు. 1948 నుంచి 1956 వరకు సెప్టెంబర్ 17వ తేదీని విమోచన దినంగా ప్రజలు జరుపుకొన్నారు. తెలంగాణలోని 10 జిల్లాలతో పాటు కర్ణాటకకు చెందిన గుల్బర్గ, రాయచూర్, బీదర్, మహారాష్ట్రాకు చెందిన నందేడ్‌లోనూ వేడుకలు జరుపుకొన్నారు.
మనం సైతం..
సెప్టెంబర్ 17వ తేదీని మతం పేరుతో ముడిపెడుతున్నారని కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిజాం నవాబుల రాచరిక నిరంకుశ పాలన, రాజాకార్ల పీడ విరగడైన రోజుగా తెలంగాణ విమోచన దినాన్ని వ్యవహరిస్తారు. నిజాం పాలన అంతం కావాలని అక్షరాయుధాలు చేతబట్టి రజాకార్ల చేతిలో షోయబుల్లాఖాన్, ఓ దేశ్‌ముఖ్ దాష్టీకానికి బలైన షేక్‌బందగీ, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ముక్ధుం మొయినుద్దీన్ తదితర ముస్లింలు కూడా ఉన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భాగం రజాకార్ల నుంచి విముక్తి కల్పించడానికి, రజాకార్లు, దేశ్‌ముఖ్‌లు, జమీందార్ల అరాచకాలను పారద్రోలడానికి ఎంతోమంది ప్రాణాలను సైతం అర్పించారు. ఈ పోరాటంలో వికారాబాద్ ప్రాంతానికి చెందిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. వికారాబాద్‌కు చెందిన నారాయణస్వామి కూడా ఒకరు. చాలామంది అమరులయ్యారు.
జైలుకెళ్లిన దొండేరావ్
వికారాబాద్‌లోని గాంధీ కాలనీకి చెందిన దివంగత దొండేరావ్ జాదవ్ స్వాతంత్రోద్యమం జరుగుతున్న సమయంలో ఈ ప్రాంతంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా గొంతు విప్పారు. వారి అరాచకాలను ప్రజలకు వినిపించారు. దీంతో నిజాం ప్రభుత్వం 1947 సెప్టెంబర్ 17న, ఆయన్ను అరెస్టు చేసి గుల్బర్గా జైలులో ఉంచింది. 1947 ఆగస్టు 15న, దేశమంతటికీ స్వాతంత్య్రం వచ్చినా నిజాం ఏలుబడిలో ఉన్న తెలంగాణకు మాత్రం స్వాతంత్య్రం సిద్ధించలేదు. 1948లో సర్దార్ వల్లాబాయ్ పటేల్ జరిపిన సైనిక చర్య ద్వారా నిజాం సంస్థానం తెలంగాణలో విలీనమైంది. దీంతో గుల్బర్గ జైలులో ఉన్న దొండేరావ్‌జాదవ్ కూడా విడుదల అయ్యారు. ఆయనకు నాటి ప్రభుత్వం తామ్రపత్రంతో సత్కరించింది. వికారాబాద్‌లో ఆయన పేరుమీద శిలాఫలకం కూడా ఏర్పాటు చేశారు.

వికారాబాద్‌లో దొండేరావ్ జాదవ్ గుర్తుగా ఏర్పాటు చేసిన శిలాఫలకం