
చిరుత కలకలం
తాండూరు రూరల్: పెద్దేముల్ మండలం నాగులపల్లి అటవీ ప్రాంత సమీపంలోని సిద్ధన్నమడుగు తండా శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పొలాలకు వెళ్లేందుకు రైతులు, పశువులు మేపేందుకు కాపరులు జంకుతున్నారు. తండా సమీపంలోని నీటికుంట, పొలాల్లో చిరుత పాదముద్రలను రైతులు గుర్తించి తాండూరు ఫారెస్ట్ అధికారులకు తెలియజేశారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సరస్వతి, ఎఫ్‌ఎస్‌ఓ స్వప్న, ఎఫ్‌వీఓ నాగసాయి రైతులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి చిరుత పాదముద్రలుగా నిర్ధారించారు. నాగులపల్లి అటవీ ప్రాంతం మీదుగా కర్ణాటక వైపు వెళ్లినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అడవి వైపు వెళ్లొద్దు
చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో పెద్దేమల్, తాండూరు మండలాల్లోని ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు తెలిపారు. పెద్దేముల్ మండలం నాగులపల్లి, రుద్రాం, ఇందూర్, ఆత్కూర్, సిద్ధన్నమడుగు తండా, ఎర్రగడ్డతండా, తట్టెపల్లి, పాషాపూర్, అడికిచెర్ల, బాయిమీదితండా తోపాటు తాండూరు మండలం గుండ్లమడుగు తండా, మైసమ్మతండా, ఉద్దాండపూర్ వాసులు జాగ్రత్తగా ఉండాలన్నారు. రాత్రి సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. పశువుల కాపరులు జాగ్రత్తంగా ఉండాలన్నారు.
సిద్ధన్నమడుగు తండా శివారులో పాదముద్రల గుర్తింపు
అప్రమత్తంగా ఉండాలన్న ఫారెస్ట్ అధికారులు

చిరుత కలకలం