
యూరియా కోసం ఆందోళన వద్దు
తాండూరు రూరల్: యూరియా కోసం రైతులు ఆందోళన చెందరాదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజరత్నం అన్నారు. సోమవారం పెద్దేముల్, తాండూరు మండలాల్లోని ఫెర్టిలైజర్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పెద్దేముల్‌లో రైతులకు నానో యూరియాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 5,47,970 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారని తెలిపారు. ఇప్పటి వరకు 22,981 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు చెప్పారు. నేడు(మంగళవారం) జిల్లాకు 120 మెట్రిక్ టన్నులు వస్తుందని వివరించారు. కావున రైతులు ఆందోళన చెందరాదని పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి ఎక్కువ యూరియా సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 620 లీటర్ల నానో యూరియా అందుబాటులో ఉందన్నారు. అవసరం ఉన్న వారు తీసుకెళ్లాలని సూచించారు. ఎరువులు, పురుగు మందులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట తాండూరు ఏడీఏ కొమురయ్య, పెద్దేముల్ ఏవో పవన్ ప్రీతం పాల్గొన్నారు.
నానో యూరియా వాడండి
బంట్వారం: నానో యూరియా వినియోగంపై రైతులు అవగాహన పెంచుకోవాలని డీఏఓ రాజారత్నం అన్నారు. సోమవారం కోట్‌పల్లిలోని ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసి రైతులతో మాట్లాడారు. నానో యూరియా కొనుగోలు చేస్తే ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చని తెలిపారు. అవసరం మేర యూరియా వాడాలని సూచించారు. అతిగా వాడితే అనర్థమని పేర్కొన్నారు. మూడు రోజుల్లో కోట్‌పల్లి మండలానికి 20 టన్నుల యూరియా వస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఓ కరుణాకర్‌రెడ్డి ఏఈఓ సందీప్ తదితరులు పాల్గొన్నారు.