
సైబర్ నేరాలు తగ్గుముఖం
ధారూరు: ఇటీవల కాలంలో సైబర్ నేరాలు తగ్గుముఖం పట్టాయని ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం ధారూరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులు పరిశీలించారు. అంతకుముందు పీఎస్ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా నేరాల సంఖ్య తగ్గిందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా గ్రామాల్లో కళాజాత బృందాల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ధారూరులో స్థిరపడిన ఇతర రాష్ట్రాల వారిని అక్కడి వ్యాపారులు మోసం చేసినట్లు స్థానిక విలేకరులు ఎస్పీ దృష్టికి తేగా ఎంతమంది.. ఎన్ని కోట్ల రూపాయలు మోసపోయారని అడిగారు. దీపక్ వైష్ణవ్ రూ.6 కోట్లు, సుబ్బారావు రూ.3 కోట్లు మోసం చేసి ఉడాయించారని ఎస్పీకి వివరించారు. ఇలాంటి విషయాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు. నిందితుల నుంచి డబ్బు రాబట్టడం ఆలస్యమువుతుందని తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ రఘురాం, ఎస్‌ఐలు రాఘవేందర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.