
రోడ్డెక్కిన అంగన్‌వాడీలు
తాండూరు టౌన్: ప్రీ ప్రైమరీ స్కూళ్లను, పీఎంశ్రీ విద్యను అంగన్‌వాడీ కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు సోమవారం ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు సంబంధిత శాఖా మంత్రి ఇళ్ల ముట్టడితో పాటు కొడంగల్‌లో సైతం నిరశన వ్యక్తం చేయాలని అనుకున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రీ ప్రైమరీ స్కూళ్లను, పీఎంశ్రీ విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకిస్తున్నామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు రావాల్సిన చిన్నారులు ప్రీ ప్రైమరీ స్కూళ్లకు వెళ్లే అంగన్‌వాడీ సెంటర్లు ఖాళీ అవుతాయన్నారు. కేంద్రాలను మూసేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలాంటివి తీసుకురావాలని చూస్తోందని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. ప్రీ ప్రైమరీ స్కూళ్లను అంగన్‌వాడీ కేంద్రంలోనే ఏర్పాటు చేసి, దానికి అదనంగా వేతనాన్ని టీచర్లకు ఇవ్వాలన్నారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనం రూ.18వేలు, పీఎఫ్ చెల్లించాలన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. గతంలో చేసిన 24 రోజుల సమ్మెకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.