
9న లక్ష తులసీ అర్చన
కొడంగల్: పట్టణంలోని బాలాజీనగర్‌లో వెలిసిన పద్మావతీ సమేత శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 9న మూడో శనివారం సందర్భంగా స్వామివారికి లక్ష తులసీ దళాలతో అర్చన నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా తెప్పించిన పూలు, తులసీ దళాలతో మూల మూర్తులకు విశేష అలంకరణ చేస్తారు. పండితులు విష్ణు సహస్ర నామావళి పటిస్తూ లక్ష తులసీ దళాలతో అర్చన చేస్తారు. శ్రావణమాసం మూడో శనివారం కావడంతో శ్రీవారి మూలమూర్తికి అభిషేకం, తోమాల సేవ, అలంకరణ చేయనున్నారు. విష్ణుసహస్ర నామార్చన, నైవేద్య సమర్పణ, మహా మంగళ హరతి తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.
అందుబాటులో సబ్సిడీ గడ్డి విత్తనాలు
అనంతగిరి: జిల్లాలోని అన్ని పశు వైద్యశాలల్లో 75శాతం సబ్సిడీపై మేలుజాతి గడ్డి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా పశు వైద్యాధికారి సదానందం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐదు కేజీల మినీ కిట్స్ పూర్తి ధర రూ.500 కాగా సబ్సిడీ రూ.375 పోను రూ.125 చెల్లించాల్సి ఉందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
స్థానిక ఎన్నికల్లో
సత్తా చాటుతాం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి
అనంతగిరి: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం వికారా బాద్ మండలం కామారెడ్డిగూడలో ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. బీజేపీతోనే సుపరిపాలన సాధ్యమన్నారు. నేడు ఎక్కడ చూసినా కేంద్రం ప్రభుత్వం చేపడుతున్న పనులే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు అమరేందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు శివరాజుగౌడ్, నాయకులు గోపాల్‌రెడ్డి, గోపాల్, నర్సింహారెడ్డి, సురేందర్‌రెడ్డి, సంజీవరెడ్డి మైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయసమస్యలు పరిష్కరించాలి
టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంత్‌రావు
చేవెళ్ల: ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కె.హన్మంత్‌రావు అన్నారు. మండలంలోని పలు పాఠశాలల్లో బుధవారం సంఘం నాయకులతో కలిసి సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెల్త్‌కార్డులు వెంటనే అమలు చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని, కామన్ సర్వీస్ రూల్స్ అమలుకు ప్రయత్నం చేయాలని, కేజీబీవీ, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, నూతన పీఆర్‌సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించి విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యల సాధనకోసం టీపీయూఎస్ ముందుంటుందని తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కోట్ల కాశీరావు, గౌరవ అధ్యక్షుడు గణపురం సురధీర్, మండల కోశాధికారి దూత కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

9న లక్ష తులసీ అర్చన

9న లక్ష తులసీ అర్చన