
మనువాదాన్ని వ్యతిరేకించాలి
కందుకూరు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితులపై దాడులు జరుగుతున్నాయని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా మైనార్టీ వర్గాలపై దాడులకు తెగబడుతుందని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ప్రకాశ్ ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో కందుకూరు, మహేశ్వరం, తలకొండపల్లి మండలాలకు సంబంధించిన ప్రజాసంఘాలతో కేవీపీఎస్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దళిత టీచర్లతో అయ్యప్ప మాల వేసిన విద్యార్థి కాళ్లు మొక్కించి మనువాద సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. గుడుల్లో దళితులకు ప్రవేశం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ ప్రవేశిస్తే ఆలయాలను శుద్ధి చేస్తున్నారన్నారు. ఇదంతా కేంద్రంలో మోదీ, అమిత్‌షా పాలనతోనే జరుగుతుందని విమర్శించారు. మతోన్మాదానికి, మనువాదానికి వ్యతిరేకంగా ప్రజలందరిని చైతన్య పరచడానికి ఈ నెల 13న ఇబ్రహీంపట్నంలోని పాషా నరహరి స్మారక కేంద్రంలో జిల్లా సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సుకు కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌వెస్లీ హాజరవుతున్నారన్నారు. సదస్సును విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ బుట్టి బాల్‌రాజ్, కేవీపీఎస్ మండలాల కన్వీనర్లు ఏర్పుల శేఖర్, కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.
కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ప్రకాశ్