
42శాతం రిజర్వేషన్ల సాధనకు పోరు
కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య
దుద్యాల్: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆగదని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేరుగు వెంకటయ్య పేర్కొన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన రెండు రోజుల ధర్నా కార్యక్రమానికి కొడంగల్ నియోజకవర్గంలోని బీసీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు గురువారం ఫోన్‌లో సాక్షితో మాట్లాడారు. రాష్ట్ర బీసీ సంఘం నాయకుడు శ్రీకాంత్‌గౌడ్‌తో కలిసి రాష్ట్రపతి భవన్ వెళ్లారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లతో పాటు చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును కేంద్రం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చి రాష్ట్రపతి ఆమోదం పొందేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కొడంగల్ తాలూకా బీసీ సంఘం అధ్యక్షుడు మన్నె బస్వరాజ్‌యాదవ్, బీసీ సంఘం నాయకులు యాదగిరి, సత్యపాల్, కృష్ణ, మన్సూర్, రాజు, కాశి యాదవ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
దుద్యాల్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఎస్‌ఐ యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం.. పోలేపల్లి గ్రామానికి చెందిన రెబ్బని శ్రీకాంత్ తన ట్రాక్టర్‌తో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారన్నారు. దుద్యాల్ మీదుగా హకీంపేట్‌కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మీసేవ నిర్వాహకులపై ఫిర్యాదు
ధారూరు: మండల కేంద్రంలోని మీసేవ నిర్వాహకులు అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని ఓ బాధితుడు గురువారం తహసీల్దార్ సాజిదాబేగంకు ఫిర్యాదు చేశారు. కొత్త రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేయడానికి వెళితే రూ.45కు బదులు రూ.60 తీసుకుంటున్నారని దోర్నాల్ గ్రామానికి చెందిన మహిపాల్ వాపోయాడు. ఇంతకుముందు కూడా తహసీల్దార్‌కు ఫిర్యాదు చేస్తే తూతూమంత్రంగా నిర్వాహకులను బెదిరించినట్లు చేసి వదిలివేశారని ఆరోపించారు. ప్రస్తుతం కొత్త రేషన్‌కార్డుల కోసం, పాత కార్డుల్లో ఉన్న కొంతమంది పేర్లు తొలగించడానికి వందల సంఖ్యలో వస్తున్నారని, వీరి నుంచి నిత్యం అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ నిర్వహించేందుకు ఆర్‌ఐని పంపిస్తున్నట్లు డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్ తెలిపారు.
కలివివనం పాట ఆవిష్కరణ
చేవెళ్ల: పర్యావరణ పరిరక్షణను ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలనే కాన్సెప్ట్‌తో తీసిన కలివివనం సినిమా అందరినీ ఆలోచింపజేస్తుందని చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, సినీ నటుడు బిత్తిరి సత్తి అన్నారు. పట్టణంలోని కేజీఆర్ గార్డెన్‌లో గురువారం సాయంత్రం చేవెళ్ల ప్రాంతానికి చెందిన నిర్మాతలు మల్లికార్జున్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి ఏఆర్ క్రియేషన్‌పై నిర్మించిన చిత్రంలోని ఓ పాటను ఆవిష్కరించారు. స్థానిక వివేకానంద కశాళాల యాజమాన్యం ఆధ్వర్యంలో స్థానిక నాయకులు సీడీని విడుదల చేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ రాజ్‌నరేంద్ర, సినిమా హీరోయిన్ నాగదుర్గ, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆగిరెడ్డి, బీజేపీ మున్సిప ల్ అధ్యక్షుడు అనంతరెడ్డి, సీనియర్ నటుడు గాంధీ, చిత్ర యూనిట్ సభ్యులు, చేవెళ్ల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కుమార్తె వెళ్లిపోయిందని..
మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య
రాంగోపాల్‌పేట్: అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమార్తె పైళ్లెన వ్యక్తితో వెళ్లిపోవడంతో మనస్తాపానికి లోనైన ఆమె తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వెంగళరావునగర్‌కు చెందిన జంగిటి రామస్వామి (50) ఆటో డ్రైవర్‌గా పని చేస్తుండగా అతడి భార్య లక్ష్మి బుద్ధభవన్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో స్వీపర్‌గా పని చేస్తుంది. గత నెల 30న అతడి కుమార్తె పైళ్లెన వ్యక్తితో వెళ్లిపోయింది. దీంతో రామస్వామి రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో మనస్తాపానికి లోనైన రామస్వామి బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. గురువారం ఉదయం లక్ష్మి భర్తను నిద్ర లేపేందుకు వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.