
చెట్టుకు రాఖీ కడుతున్న చిన్నారులు (ఫైల్)
వివిధ రకాల డిజైన్ రాఖీలు
కోనుగోలుకు సిద్ధంగా పూసల రాఖీలు
సోదరి కష్టసుఖాల్లో అనుక్షణం తోడుగా ఉండేందుకు సోదరులకు కట్టే రక్షాబంధన్ పర్వదినం రానే వచ్చేసింది. అనురాగం, ఆప్యాయతల మేళవింపులో జరుపుకొనే అపూర్వ వేదికకు ప్రతి తోబుట్టువు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పర్యావరణహితంగా పండుగను నిర్వహించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
షాబాద్: అక్కాచెల్లెళ్లు.. అన్నాదమ్ములకు రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకుంటారు.. ఏటా రాఖీ పండుగను ఘనంగా జరుపుకొంటారు.. విదేశాల్లో ఉన్న వారు కూడా రక్షాబంధన్‌కు ఇక్కడికి వచ్చి అన్నాదమ్ములకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపిస్తారు. శనివారం జరుపుకొనే రాఖీ పండుగకు ఆడపడుచులు పుట్టింటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తల్లిదండ్రుల తర్వాత అనుబంధం, అనురాగం, ఆప్యాయత తోబుట్టువుల మధ్య ఉంటుంది. ఇంటి ఆడపడుచుల సుఖాసంతోషాలే తమ సంతోషంగా భావిస్తారు. సోదరులు ఇంతటి విశిష్టమైన అనుబంధానికి ప్రతీకగా, సోదరుల క్షేమం కోరుతూ ఏటా శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున రక్షాబంధన్ నిర్వహిస్తారు.
మొదలైన సందడి
అనుబంధాలకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చే హిందూ సంస్కృతిలో రక్షాబంధన్‌కు విశిష్టమైన స్థానం ఉంది. సోదరి, సోదరుల అనురాగానికి చిహ్నంగా ఈ వేడుక జరుపుకొంటారు. ఇళ్లల్లోనే కాకుండా ఆలయాల్లో, సామూహిక వేదికల వద్ద ఈ పర్వదినాన్ని ఆనందోత్సహాల నడుమ నిర్వహించుకోనున్నారు. బాలికలు, యువతులు, మహిళలు అంతా రాఖీ బంధన్ వేడుకను నిర్వహించేందుకు నాలుగు రోజుల ముందు నుంచే ఆడపడుచులు ఉత్సాహంగా రాఖీలు కోనుగోలు చేయడం మొదలుపెట్టారు.
దీక్ష సంకల్పమే రక్ష
ఏదైనా కార్యక్రమం నిర్వహించ తలపెట్టినప్పుడు రక్షను ధరించడం హైందవ ఆచారం. ఆ కార్యక్రమం ఏ విఘ్నాలు లేకుండా సజావుగా సాగాలని, అనుక్షణం లక్ష్యాన్ని గుర్తు చేసేందుకు ఈ రక్షను ధరిస్తారు. వివాహం, యజ్ఞయాగాదులు, వ్రతాలు, నోములు తదితర కార్యక్రమాల్లో ఈ రక్షాధారణ తప్పనిసరి. పూర్వకాలంలో యుద్ధానికి వెళ్లే భర్తలకు భార్యలు, సోదరుల క్షేమాన్ని కాంక్షిస్తూ సోదరీమణులు రక్షలు కట్టేవారు. ఆనాటి నుంచి ఆనవాయితీగా ఈ ఆచారం వస్తోంది.
జోరుగా రాఖీల విక్రయాలు
అన్నాచెల్లెల్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ దగ్గర పడుతుండడంతో మండలంలో రాఖీల క్రయ విక్రయాలు జోరందుకున్నాయి. మారుతున్న కాలానికి, అభిరుచులకు అనుగుణంగా, దుకాణదారులు పలు డిజైన్‌లల్లో రాఖీలు అందుబాటులో ఉంచారు.
ప్రకృతి మెచ్చిన ‘వృక్షాబంధన్’
కడ్తాల్: ప్రకృతికి మానవాళి రక్షణగా ఉండాలనే గొప్ప సంకల్పంతో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ వినూత్నంగా గత 12 ఏళ్లుగా విద్యార్థులతో కలిసి చెట్లకు రాఖీలు కట్టి వృక్షాబంధన్ నిర్వహిస్తోంది. ప్రకృతికి మానవాళికి మధ్య సైతం అనుబంధం పెంపొందాలనే సదుద్దేశంతో వృక్షాబంధన్ కార్యక్రమం ఏటా దిగ్విజయంగా కొనసాగుతుంది. పిల్లలు, యువకులు, గ్రామస్తులు, విద్యార్థులు అందరి ఆధ్వర్యంలో పర్యావరణ హితంగా ‘నేను నీకు రక్ష.. నువ్వు నాకు రక్ష... మనమంతా భూమాతకు రక్ష’ అనే గొప్ప సంకల్పంతో వృక్షాబంధన్ కార్యక్రమం నిర్వహిస్తారు.
ఆవు పేడతో రాఖీలు
తాండూరు టౌన్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలాంటి హాని కలుగచేయని వస్తువులను వినియోగించాలని ప్రకృతి ప్రేమికులు పదే పదే చెబుతుంటారు. ఈ క్రమంలోనే మరో ముందడుగు వేసి ఆవు పేడ, మూత్రంతో ఏకంగా రాఖీలను తయారు చేశారు. పర్యావరణాన్ని రక్షించుటతో హిందూ సంప్రదాయ పండగలు సైతం తమ వంతు పాత్ర పోషిస్తాయనేది సహజసిద్ధంగా తయారు చేసిన రాఖీలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాండూరు పట్టణ మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కొట్రిక విజయలక్ష్మి ఏటా పర్యావరణ పరిరక్షణకు తన వంతు బాధ్యతగా ఆవు పేడ, మూత్రంతో తయారు చేసిన రాఖీలను సోదరులకు కట్టాలని ఆమె చెబుతున్నారు. ఈ రాఖీలు తిరిగి భూమిలోకి చేరి మట్టి సారవంతాన్ని పెంపొందిస్తాయంటున్నారు. పరిగి ప్రాంతానికి చెందిన శివరామకృష్ణా చారి అనే వ్యవసాయ విద్య అభ్యసించిన ఓ యువకుడు దీర్ఘాయుష్షు అనే సంస్థను నెలకొల్పి ఆవుపేడ, మూత్రంతో రాఖీలను తయారు చేసి, పర్యావరణ పరిరక్షణపై తన వంతు బాధ్యతను బహిర్గతం చేస్తున్నారు. ఇలాంటి రాఖీలు మార్కెట్‌లో విక్రయానికి సైతం పెట్టడం విశేషం.

ఆవు పేడతో తయారు చేసిన రాఖీ

చెట్టుకు రాఖీ కడుతున్న విద్యార్థులు

రాఖీని చూపుతున్న మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ విజయలక్ష్మి