
సీసీ కెమెరాలతో నిఘా పటిష్టం
యాచారం: సీసీ కెమెరాలుంటే పోలీస్ నిఘా ఉన్నట్లేనని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు పేర్కొన్నారు. మండల పరిధిలోని తక్కళ్లపల్లిలో గురువారం సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ప్రతి ఇంటి వద్ద సీసీ కెమెరాలు బిగించుకోవాలని సూచించారు. రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, యువకులు సమష్టిగా డబ్బులు జమ చేసి గ్రామాల్లోని ప్రధాన కూడళ్లల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాలు జరిగిప్పుడు సులభంగా నేరస్తులను గుర్తించే అవకాశం ఉందన్నారు. సీసీ కెమెరాలుంటే నేరాలు, చోరీలు తగ్గుముఖం పడుతాయన్నారు. యాచారం మండలంలోని 24 గ్రామ పంచాయతీలు, మరో 20కి పైగా అనుబంధ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతల సహకారం కోరనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో యాచారం సీఐ నందీశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐ మధు, గ్రామస్తులు శ్రీశైలం, సంతోష, మల్లేష్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు