
పన్ను చెల్లింపుతోనే అభివృద్ధి
అనంతగిరి: గ్రంథాలయాలను అభివృద్ధి పరిచేందుకు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు లైబ్రరీ పన్నులను తప్పనిసరిగా వసూలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ అధికారులను ఆదేశించారు. బుధవారం గ్రంథాలయ పన్ను వసూలు కమిటీతో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) తన ఛాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రంథాలయ సంస్థలకు ప్రధాన ఆదాయ వనరు పన్ను మాత్రమేనని, వసూలును బట్టి జిల్లాలో అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు చెల్లించాల్సిన గ్రంథాలయ పన్నులను సకాలంలో చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ఐదేళ్లుగా చెల్లించాల్సిన గ్రంథాలయ బకాయి పన్నును చెల్లించే దిశగా అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. గ్రంథాలయాలను జ్ఞానాన్ని పెంపొందించే దిశగా తీర్చి దిద్దాలని, భవిష్యత్ తరాలకు కూడా ఎంతగానో ఉపయోగపడే విధంగా చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, జిల్లా ఆడిట్ అధికారి శ్రీనివాస్‌బాబు, గ్రంథాలయ కార్యదర్శి సురేష్, మున్సిపల్ కమిషనర్లు బలరాంనాయక్, విక్రమ్ సింహారెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ సుధీర్