
బిరబిరా కృష్ణమ్మ
కొడంగల్: కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పథకం పనులు జోరుగా సాగుతున్నాయి. ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపడంతో పరుగులు పెడుతున్నాయి. నారాయణపేట జిల్లా సరిహద్దు వరకు పనులు పూర్తి కాగానే మన జిల్లాలో ప్రారంభిస్తారు. మొదటి విడతలో దామరగిద్ద మండలం కానుకుర్తి వరకు చేపట్టారు. ఇది పూర్తి కాగానే కొడంగల్ నియోజకవర్గంలో ప్రారంభమవుతాయి. కొడంగల్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో లక్షా 5వేల ఎకరాలకు సాగు నీరు అందించే ఈ పథకానికి సుమారు రూ.4,500 కోట్లు అంచనా వేశారు. మొదటి విడతలో రూ.2,945 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
జీఓ 69కి జీవం పోసిన సీఎం
గతంలో అటకెక్కిన జీఓ 69కు సీఎం రేవంత్‌రెడ్డి జీవం పోశారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసింది. బీమా ఎత్తిపోతల ద్వారా కొడంగల్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లోని లక్షా 5వేల ఎకరాలకు సాగునీరు, 5లక్షల 50వేల మందికి తాగునీరు అందించాలని నిర్ణయించింది. 2014లో రాష్ట్ర విభజన జరిగి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని పక్కన పెట్టింది. 69 జీఓను అమలు చేయకుండా అటకెక్కించింది.
నాలుగు రిజర్వాయర్లు
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మీదుగా కృష్ణానది ప్రవహిస్తూ తెలంగాణలో నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోకి ప్రవేశిస్తుంది. కృష్ణానదిపై తెలంగాణలో తొలి ప్రాజెక్టు జూరాలను నిర్మించారు. ఇక్కడి నుంచి నికర జలాలతో మూడు నియోజకవర్గాలకు సాగు, తాగునీరు ఇవ్వాలని ఇంజనీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బూత్‌పూర్ రిజర్వాయర్ నుంచి నాలుగు దశల్లో ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందిస్తారు. ఊట్కూర్, జాజాపూర్, జయమ్మ చెరువు, కానుకుర్తి దగ్గర రిజర్వాయర్లు నిర్మిస్తారు. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా ఊట్కూర్, జాజాపూర్, జయమ్మ చెరువు, కానుకుర్తి, లక్ష్మీపూర్, ఈర్లపల్లి, దౌల్తాబాద్, హస్నాబాద్, కొడంగల్, బొంరాస్‌పేట చెరువులను కాకరవాణి ప్రాజెక్టును నింపి ఆయకట్టు భూములకు సాగునీరు వదులుతారు. ఈ పథకానికి రేవంత్ సర్కార్ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
తెరపైకి ‘పాలమూరు – రంగారెడ్డి’
కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టి పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తెచ్చారు. ఈ ప్రాంతానికి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం నుంచి కొడంగల్‌కు సాగునీరు రాదని కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పథకం జలసాధన సమితి సభ్యులు ఉద్యమించారు. అయినా గత ప్రభుత్వం స్పందించలేదు. రేవంత్‌రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న 2014 నుంచి 2018 వరకు పలుమార్లు ఈ పథకాన్ని అమలు చేయాలని బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేశారు. అయినా పాలకులు పట్టించుకోలేదు. ఎట్టకేలకు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024లో ఈ పథకానికి ప్రాణం పోశారు.
వేగంగా కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పనులు
లక్ష ఎకరాలకు పైగా సాగునీరు, 5.50 లక్షల మందికి తాగునీరే లక్ష్యం
ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.4,500 కోట్లు
మొదటి విడతలో రూ.2,945 కోట్లు మంజూరు

బిరబిరా కృష్ణమ్మ