
మహోన్నత వ్యక్తి జయశంకర్
అనంతగిరి: తెలంగాణ ఉద్యమం కోసం ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేశారని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని అడిషనల్ కలెక్టర్ సుధీర్ అన్నా రు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి తోకలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయశంకర్ సేవలను కొనియాడారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఆవస్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అన్నారు. ఆయన కలలుగన్న తెలంగాణ కోసం మనమందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఉపేందర్, డీఆర్‌డీఏ శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
బూత్‌స్థాయి అసిస్టెంట్లను
నియమించుకోవాలి
పోలింగ్ కేంద్రాల్లో పర్యవేక్షణకు ఆయా పార్టీలు బూత్‌స్థాయి అసిస్టెంట్లను నియమించుకోవాలని అడిషనల్ కలెక్టర్ సుధీర్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణకు సన్నాహాలు, కొత్త పోలింగ్ బూత్‌ల ఏర్పాటు, భవనాల గుర్తింపు తదితర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 1,200 మందికి మించి ఓటర్లు ఉండరాదన్నారు. జిల్లాలో 284 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, బూత్‌స్థాయి అసిస్టెంట్లను నియమించి ఎన్నికల కమిషన్ సైట్‌లో అప్‌లోడ్ చేసి అనుమతి పొందాలని సూచించారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు సమన్వయంతో పని చేసి ఓటరు జాబితాలో పేర్ల మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో వికారాబాద్ తహసీల్దార్ లక్ష్మీనారాయణ, డీటీ అనిత పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ సుధీర్
కలెక్టరేట్‌లో ఘనంగా జయంతి వేడుకలు