
ఏం కొనలేం... ఏం తినలేం!
దౌల్తాబాద్: రోజురోజుకు కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. దీంతో వినియోగదారుల పరిస్థితి కొనలేం..తినలేం అనట్టుగా మారింది. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలను పెరుగుతున్న ధరలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కూరగాయల సాగు తగ్గిపోవడంతో సప్లయ్ తగ్గింది. మార్కెట్లో డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. అందునా వ్యాపారులు ఇదే అదనుగా భావించి ధరలు రెండింతలు పెంచి అమ్ముకుంటున్నారు. దీంతో పేదలు ఎక్కువగా కూరగాయలు కొనలేని పరిస్థితిలో ఉన్నారు. రూ.200లతో మార్కెట్‌కు వెళ్తే నాలుగు రకాల కూరగాయలే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలతో ప్రస్తుతం పప్పు, చింతపండుతో సరిపెట్టుకోవలసి వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం శ్రావణ మాసం కావడంతో పెళ్లిళ్లు, పూజల నేపథ్యంలో కూరగాయల వంటలకే ప్రాధాన్యం ఉంటుంది. దీంతో రేట్లు పెరిగే అవకాశం కూడా ఎక్కువే. ఈ విషయంలో అధికారులు స్పందించి రైతు బజార్‌లలో దళారులు, వ్యాపారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల వద్ద కొనుగోలు చేసేవిధంగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
ధరలు ఇలా..
కిలో మిర్చి రూ.100, టమాట 40, బీరకాయ 80, దొండకాయ 80, బెండకాయ 80, గోబిపువ్వు 100, వంకాయ 80, ఆలు 60, కిలోచిక్కుడుకాయ రూ.80లుగా అమ్ముతున్నారు.
భారంగా కూరగాయల ధరలు
ఇబ్బందుల్లో వినియోగదారులు
పట్టించుకోని అధికారులు