
‘రైతు బజారు’పాలు
వికారాబాద్: రైతు బజార్లలో సమస్యలు తిష్ట వేశాయి. కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించే అన్నదాతలు కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారు. సంతలు, మార్కెట్లు మరీ అధ్వానంగా మారాయి. రైతులతో పాటు కొనుగోలుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా కేంద్రం వికారాబాద్‌లోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నా.. కూరగాయల మార్కెట్, రైతు బజార్‌లలో తాగునీటి వసతి కూడా లేదు. మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక ఇక్కట్ల పాలవుతున్నారు. ఆయా గ్రామాల నుంచి తెల్లవారుజామునే అన్నదాతలు పంట ఉత్పత్తులతో మార్కెట్లకు చేరుకుంటారు. వికారాబాద్‌లోని మహాశక్తి థియేటర్ ముందు ఉన్న మార్కెట్‌కు, రైతు బజార్‌కు, కూరగాయల మార్కెట్‌లో వ్యాపారాలు చేసేందుకు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వీటన్నింటిలోనూ సమస్యలు తాండవం చేస్తున్నాయి. తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పేరుకే రైతు బజార్లు.. అక్కడ షెడ్లు కూడా లేవని అన్నదాతలు అంటున్నారు రోజంతా ఎండలోనే కూరగాయలు విక్రయించాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆగిన ‘ఇంట్రిగేటెడ్’
గత ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను మంజూరు చేసింది. జిల్లాలోని నాలుగు మున్సిపల్ కేంద్రాల్లో నాలుగేళ్ల క్రితం ఇందుకు సంబంధించిన పనులను ప్రారంభించారు. కొన్ని చోట్ల పిల్లర్ దశలో పనులు ఆగిపోగా.. మరికొన్ని చోట్ల ప్రారంభమే కాలేదు. మరో చోట చేసిన పనులకు బిల్లులు రాక.. వచ్చిన డబ్బులో తమకూ వాటా కావాలని ప్రజా ప్రతినిధులు పేచీ పెట్టడంతో కాంట్రాక్టర్ పనులు ఆపేసి పారిపోయాడు. వికారాబాద్ పట్టణంలో పిల్లర్ దశలోనే ఆగిపోయాయి. ప్రస్తుతం రైతులు ఎండలో కూరగాయలు విక్రయిస్తున్నారు. పరిగిలో స్లాబ్ వేసి వదిలేశారు. తాండూరులో పనులు ప్రారంభించి మిన్నకుండిపోయారు. కొడంగల్‌లో ప్రారంభించలేదు.
రూ.3 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు..
గత ప్రభుత్వం ఒక్కో మున్సిపాలిటీలో రూ.3 కోట్ల నుంచి రూ.6 కోట్లు వెచ్చించి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మించాలని భావించింది. పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో రెండెకరాల విస్తీర్ణంలో మార్కెట్ నిర్మించాలని నిర్ణయించారు. వికారాబాద్, తాండూరు పట్టణాల్లో జనాభా, అవసరాలను బట్టి ఐదు నుంచి ఆరు ఎకరాల్లో నిర్మించేలా ప్లాన్ చేశారు. నాలుగేళ్ల క్రితం స్థలాలను పరిశీలించి 2021లో టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. ఆ తర్వాత పనులు ప్రారంభమైనా నత్తనడకనే సాగాయి. ఎక్కడా పిల్లర్, స్లాబ్ దశ దాటనేలేదు. ప్రస్తుత ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను పూర్తి చేయాలని ఆయా ప్రాంతాల రైతులు, ప్రజలు కోరుతున్నారు.
మార్కెట్లలో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ కూరగాయల విక్రయాలు
తాగునీటికీ తప్పని అవస్థలు
నాలుగేళ్లుగా పూర్తికానిఇంటిగ్రేటెడ్ మార్కెట్లు
అన్ని మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి