
దంచికొట్టిన వాన
విరిగి పడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
దోమ: మండల వ్యాప్తంగా గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దోమ – ఊటుపల్లి మార్గంలో చెట్లు విరిగి పడటంతో వాహ నాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పంచాయతీ కార్యదర్శి రవి జేసీబీ సాయంతో చెట్లను తొలగించారు.
వికారాబాద్‌లో భారీ వర్షం
అనంతగిరి: వికారాబాద్ పట్టణం, పరిసర ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం పడింది. దీంతో ప్రధాన రోడ్లన్నీ జ లమయంగా మారాయి. పలు చోట్ల వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది.
ధారూరులో..
ధారూరు: మండలంలో భారీ వర్షం పడటంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. పది రోజుల నుంచి వాన జాడ లేక కంది, పత్తి, పెసర, మినుము, మొక్కజొన్న తదితర పంటలు ఎండుముఖం పట్టాయి. ప్రస్తుత వర్షం పంటలకు మేలు చేస్తుందని రైతులు తెలిపారు. హరిదాస్‌పల్లి, ధారూరు సమీపంలోని వాగులు ఉధృతంగా ప్రవహించాయి.
జోరు వాన
తాండూరు రూరల్: తాండూరు, పెద్దేముల్ మండలాల్లో గురువారం జోరు వర్షం పడింది. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పత్తి, కంది పంటలకు ప్రస్తుత వర్షాలు జీవం పోశాయని అన్నదాతలు పేర్కొన్నారు.
ధారూరు: చింతకుంట – హరిదాస్‌పల్లి గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వాగు
అనంతగిరి: జైదుపల్లి సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు