
ప్రైవేటుకు ‘ఇందిరమ్మ’ ఇసుక..!
బషీరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సమస్య ఉండొద్దని భావించిన ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు అక్రమార్కులు లబ్ధిదారుల పేరిట అక్రమ దందా సాగిస్తున్నారు. ప్రైవేటు నిర్మాణాలకు భారీగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలోని నావంద్గీ ఇసుక రీచ్ నుంచి యథేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతోంది. మంతట్టి నుంచి ఇందర్‌చెడ్ వరకు సుమారు 12 కిలోమీటర్ల మేర కాగ్నా నదీ పరివాహక ప్రాంతం ఉంది. నావంద్గీ వద్ద ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు అనుమతులు ఇస్తుంటారు. కొంతమంది వాపారులు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను రెవెన్యూ కార్యాలయంలో చూపి అనుమతులు పొందుతున్నారు. అనంతరం ప్రైవేటు నిర్మాణాలకు ఇసుక తరలించి ప్రభుత్వ ఆదాయానికి భారీ గా గండి కొడుతున్నారు. బషీరాబాద్, నావంద్గీ, మంతన్‌గౌడ్, కొర్విచెడ్, పర్వత్‌పల్లి, నీళ్లపల్లి, బాబునాయక్ తండా, అల్లాపూర్, దామర్‌చెడ్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక తరలించాల్సి ఉందని 40 ట్రాక్టర్లకు అనుమతులు తీసుకున్నారు. ఆ పత్రాలు చూపి యథేచ్ఛగా ఇసుక దందా చేస్తున్నారు.
కాగ్నాను తోడేస్తున్న తోడేళ్లు
కాగ్నా పరీవాహక గ్రామాలైన మంతట్టి, కంసాన్‌పల్లి(ఎం), జీవన్గీ, క్యాద్గీరా, గంగ్వార్, ఇందర్‌చెడ్, మైల్వార్, ఎక్మాయి, అల్లాపూర్, దామర్‌చెడ్, కొత్లాపూర్ నుంచి ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక తరలింపునకు ఎలాంటి అనుమతులు లేవు. కానీ ఈ గ్రామాల నుంచి నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుక ను అక్రమంగా తరలిస్తున్నారు. బాద్లాపూర్, కాశీంపూర్, కుప్పన్‌కోట్ గ్రామాలకు, తాండూరు మండలం గోనూరు నుంచి కూడా రాత్రి వేళల్లో దొంగతనంగా ఇసుక రవాణా చేస్తున్నారు.
నిద్ద్దరోతున్న యంత్రాంగం
చీకటి పడగానే కాగ్నాపై ఇసుక తోడేళ్లు పంజా విసురుతున్నాయి. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఈ విషయం రెవెన్యూ, పోలీసు అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. బహిరంగ మార్కెట్‌లో ఒక ట్రాక్టర్ ఇసుకను రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నారు. పోలీసుల దాడుల్లో ట్రాక్టర్లు పట్టుబడితే రూ.5 వేలు జరిమానా కట్టి మరుసటి రోజు నుంచే మళ్లీ దందా సాగిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
లబ్ధిదారుల పేరుతో దందా
కాగ్నా నుంచి భారీగా తరలింపు
కాసులు కొల్లగొడుతున్న అక్రమార్కులు
చోద్యం చూస్తున్న
రెవెన్యూ, పోలీస్ శాఖలు
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
కేసులు పెడతాం
ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇస్తున్న ఇసుకను ప్రైవేటు అవసరాలకు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ట్రాక్టర్లను కూడా సీజ్ చేస్తాం. ఇసుక రీచ్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ట్రాక్టర్ డ్రైవర్లు ఇసుక ఎక్కడ డంప్ వేస్తున్నది మాకు తెలియదు. ఎవరికి అనుమతులు ఇచ్చామో వారి ఇళ్లకు ఇసుక చేరిందా లేదా అని పరిశీలిస్తాం. తప్పు జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం.
– షాహెదాబేగం, తహసీల్దార్