
ఏ ఒక్క దరఖాస్తూ పెండింగ్‌లో ఉండొద్దు
అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్
ధారూరు: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో రైతులు ఇచ్చిన దరఖాస్తులను ఆగస్టు 14వ తేదీ నాటికి క్లియర్ చేయాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ ఆదేశించారు. గురువారం ధారూరు రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించి భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం తహసీల్దార్, డీటీ, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఇచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సకాలంలో పరిష్కరించాలన్నారు. ఎవరికీ అన్యాయం జరుగకుండా చూసుకోవాలని సూచించారు. ఏ ఒక్క దరఖాస్తు పెండింగ్‌లో పెట్టరాదని ఆదేశించారు. అనంతరం కార్యాలయానికి వచ్చిన రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సాజిదాబేగం, డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్, ఆర్‌ఐలు స్వప్న, దేవేందర్‌రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పెట్రోల్ బంక్‌కు స్థలం కేటాయింపు
దుద్యాల్: మండలంలోని హకీంపేట్‌లో ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పెట్రోల్ బంక్ కోసం గురువారం తహసీల్దార్ కిషన్ స్థలాన్ని కేటాయించారు. గ్రామ శివారులో సర్వే నంబర్ 256లో 20 గుంటల ప్రభుత్వ భూమిని కేటాయించారు. మండలంలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఇక్కడ పెట్రోల్ బంక్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో ఆర్‌ఐ నవీన్‌కుమార్, ఏపీఎం బందెయ్య, సీసీ సంజీవ్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, చాకలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో
నిర్లక్ష్యం వద్దు
డీపీఓ జయసుధ
దోమ: గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహించరాదని డీపీఓ జయసుధ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. గురువారం దోమ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, శ్మశానవాటికను పరిశీలించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌కు సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కాలనీలో బ్లీచింగ్ పౌడర్ చల్లించాలన్నారు. దోమల నివారణకు ఫాగింగ్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గ్యామా తదితరులు పాల్గొన్నారు.
ఏబీవీపీ పట్టణ
కార్యదర్శిగా తేజ
అనంతగిరి: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వికారాబాద్ నగర కమిటీ కార్యదర్శిగా తేజను నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా ఽశాఖలకు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థి సమస్యలపై పోరాటం కొనసాగుతుందని తెలిపారు.