
అటవీ భూమి స్వాధీనం
ధారూరు: ఆక్రమణకు గురైన అటవీ భూమిలో బుధవారం ఆ శాఖ అధికారులు మొక్కలు నాటారు. ధారూరు ఫారెస్టు రేంజర్ బి.రాజేందర్ అధ్వర్యంలో డిప్యూటీ ఫారెస్టు రేంజర్ హేమ, సెక్షన్, బీట్ ఆఫాసర్లు, సిబ్బంది కలిసి అల్లనేరేడు, వేప, నెమలినార, కానుగ, ఉసిరి, తెల్లమద్ది, సీతాఫల్ తదితర 11,110 మొక్కలు నాటి, సపోర్ట్ కర్రలు పాతించారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఆర్‌ఓ రాజేందర్ మాట్లాడుతూ.. ఫారెస్ట్ భూముల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. పట్టాదారు పాసుపుస్తకాల్లో ఉన్న విస్తీర్ణానికి మించి గజం స్థలాన్ని ఆక్రమించినా చర్యలు తప్పవన్నారు. స్టేషన్‌ధారూరు సమీప అడవిలోని 98వ కంపార్ట్‌మెంట్ ఏడుకానల వద్ద గతేడాది 25 ఎకరాల్లో మొక్కలు నాటించామని తెలిపారు. మదనంతాపూర్, సంగాయపల్లితండాలకు చెందిన కొందరు 12 ఎకరాల్లోని మొక్కలను ధ్వంసం చేసి, అప్పట్లో కంది, పత్తి పంటలను సాగు చేశారని వెల్లడించారు. ఈ స్థలంలో ఈసారి కూడా కంది సాగు చేసిన విషయం తమ దృష్టికి రావడంతో భూమిని స్వాధీనం చేసుకుని ప్లాంటేషన్ చేశామని స్పష్టంచేశారు. ఫారెస్టు భూముల్లోకి వస్తున్న వారిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఎవరూ అటవీ భూముల అన్యాక్రాంతానికి పాల్పడొద్దని తెలిపారు.
● 25 ఎకరాల్లో 11,110 మొక్కలు నాటిన అధికారులు
● ఆక్రమణలకు ప్రయత్నిస్తే
కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక