
శ్రీవారి ఆలయ అభివృద్ధికి శ్రీకారం
భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ
● 8,736 గజాల స్థలసేకరణకు రంగం సిద్ధం ● నిర్వాసితులకు ఇంటి స్థలం, పరిహారం ● ఆగమ శాస్త్రోక్తంగా ఆలయ విస్తరణ
కొడంగల్: పేదల తిరుపతిగా పేరుగాంచిన కొడంగల్ పట్టణంలోని బాలాజీనగర్‌లో వెలిసిన పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆలయం చుట్టూ ఉన్న ప్రైవేటు స్థలాన్ని సేకరించడానికి గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. 96 మంది నుంచి 8,736 గజాల స్థల సేకరణకు రంగం సిద్ధమైంది. ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న వారికి జాతర స్థలంలో ప్రత్యేక వెంచర్ వేసి ఇంటి స్థలంతో పాటు పరిహారం ఇవ్వనున్నారు. వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా ఆలయాన్ని విస్తరించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకు వచ్చింది. భూ సేకరణ తర్వాత టీటీడీ, తెలంగాణ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయాన్ని విస్తరిస్తారు. అన్ని వసతులు, సౌకర్యాలతో అభివృద్ధి చేస్తారు. నూతన భవనాలు నిర్మిస్తారు. క్యూ లైన్, కల్యాణ మండపం, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, భక్తుల సౌకర్యార్థం స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు, పార్కింగ్ తదితర వాటిని నిర్మిస్తారు. టీటీడీ నిధులతో అభివృద్ధి చేయనున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది.
ఆలయ చరిత్ర
పట్టణానికి చెందిన దివంగత నందారం మిడిదొడ్డి నర్సింలు గుప్తా తిరుమల శ్రీవారికి అపార భక్తుడు. ఆయన ఒంట్లో శక్తి ఉన్నన్ని రోజులు తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకునే వారు. వయో భారంతో తిరుమలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. తిరుమలకు వెళ్లలేనేమోనని శ్రీవారిని వేడుకుంటాడు. అప్పుడు వేంకటేశ్వర స్వామి నర్సింలకు కలలో కనిపించి కొడంగల్‌లో తనకు ఆలయాన్ని నిర్మించాలని కోరారు. ఈ విషయాన్ని నర్సింలు తిరుమలకు వెళ్లి అర్చకులకు తెలిపాడు. కొడంగల్‌లో ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరాడు. దీన్ని అర్చకులు తిరస్కరించారు. నిరాశతో నర్సింలు గుప్తా తిరుగు ప్రయాణమయ్యారు. కొన్ని రోజుల తర్వాత ఊహించని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీమాన్ పెద్దింటి వెంకట రమణ దీక్షితులు, శ్రీమా న్ మాడంబాక్కం శ్రీనివాస భట్టాచార్యులు కొడంగల్‌కు వచ్చి శ్రీవారి ఆలయ నిర్మాణానికి సిద్ధం కావాలని నర్సింలు గుప్తాను కోరారు. తదనంతరం ఆలయ నిర్మాణం, స్వామివారి ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. నాటినుంచి నేటి వరకు ఏటా ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. తిరుమల నుంచి శేష వస్త్రం, పట్టు వస్త్రాలు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
నిత్య పూజలు
పట్టణంలో వెలిసిన శ్రీవారి ఆలయ మూలాలు తిరుమలలో ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. కలియుగ వైకుంఠ దైవం వేంకటేశ్వర స్వామి భక్తుల ఇలవేల్పుగా నిలిచారు. బ్రాహ్మణులు తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం వైఖానస ఆగమ శాస్త్ర సలహాదారులుగా ఉన్న సుందర వరద భట్టాచార్యుల ఆధ్వర్యంలో 50 ఏళ్లు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగాయి. ఆయన తదనంతరం ఆయన పుత్రులు ఇక్కడ ఉత్సవాల నిర్వహణలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో నిత్యం వాహన సేవలు, కై ంకర్యాలు, పూజలు, పవిత్రోత్సవాలు, ధనుర్మాసం, వైకుంఠ ఏకాదశి, దసరా, దీపావళి, ఉగాది, సంక్రాంతి, ఆషాడ శుద్ధ ఏకాదశి, ప్రతి రోజు సుప్రభాతం, తోమాల సేవ, అలంకరణ తదితర వాటిని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.