
చురుగ్గా జాతీయ రహదారి పనులు
కొడంగల్: మహబూబ్‌నగర్ – చించోలీ జాతీయ రహదారి పనుల్లో భాగంగా బుధవారం రోడ్డుకు ఇరువైపులా ఉన్న భారీ వృక్షాలను తొలగించారు. మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర రహదారిని నేషనల్ హైవేగా మార్చింది. మొదటి విడతలో మహబూబ్‌నగర్ నుంచి దుద్యాల్ గేటు వరకు పనులు నిర్వహించారు. రెండో విడతలో దుద్యాల్ గేటు నుంచి తాండూరు మీదుగా కర్ణాటక సరిహద్దు వరకు పనులు చేపట్టాల్సి ఉంది. ఇందులో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. కొడంగల్ మండలం హస్నాబాద్ నుంచి పర్సాపూర్ సమీపంలోని చెట్లను తొలగించారు. జాతీయ రహదారి పనులను వేగవంతం చేయాలని స్థానికులు కోరుతున్నారు. చెట్ల తొలగింపు పనులతో రాకపోకలకు ఇబ్బందిగా మారుతోందని ప్రయాణికులు, స్థానికులు వాపోతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం నుంచి కర్ణాటక రాష్ట్రం చించోలీ వరకు జాతీయ రహదారి ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం గతంలో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి 167 ఎన్‌హెచ్‌గా పేరు పెట్టారు. మహబూబ్‌నగర్ నుంచి హన్వాడ, గండీడ్, కోస్గి, కొడంగల్, తాండూరు మీదుగా ఈ రహదారిని నిర్మిస్తున్నారు. బెంగళూరు, ముంబై జాతీయ రహదారులను కలిపే ఈ మార్గం సుమారు 150 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. మన జిల్లాలో 45 కిలోమీటర్లు, కర్ణాటక రాష్ట్రంలో 50 కిలో మీటర్లు, నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో 55 కిలోమీటర్ల మేర రహదారి విస్తరించి ఉంది. జాతీయ రహదారి అందుబాటులోకి వస్తే మూడు జిల్లాల పరిధిలో రవాణా వ్యవస్థ కూడా మెరుగు పడుతుంది.
పర్సాపూర్ సమీపంలో
రోడ్డుకు ఇరువైపులా చెట్ల తొలగింపు