
పర్యవేక్షణే పరమావధి
● మధ్యాహ్న భోజనంపై అప్రమత్తత ముఖ్యం
● నిర్వాహకులకు బిల్లులు విడుదల చేయాలి
● ప్రభుత్వానికి విద్యార్థుల తల్లిదండ్రుల సూచన
దౌల్తాబాద్: మధ్యాహ్న భోజన మెనూ బాగున్నా అమలులో ఇబ్బందులు తప్పడం లేదు. నిత్యావసరాల ధరల పెరుగుదలతో గిట్టుబాటు కాక విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం ఏజెన్సీ వారికి కష్టమవుతుంది. గతేడాది రాష్ట్రంలోని పలు గురుకులాల్లో ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనం వికటించి పిల్లలు అస్వస్థతకు గురికావడంతో అంతటా అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేశారు. అప్పట్లో నోడల్ అధికారులను నియమించి పర్యవేక్షించారు. ఈ విద్యా సంవత్సరం తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
బాధ్యతే ముఖ్యం
అనేక బడుల్లో కొంతకాలంగా ఆహార కమిటీల పాత్ర అంతంతమాత్రంగానే ఉంది. కొన్ని బడుల్లో నేరుగా విద్యార్థులకు భోజనం వడ్డిన్నారు. అమ్మ ఆదర్శ కమిటీ సభ్యుల పర్యవేక్షణ కూడా కొన్ని చోట్ల సరిగ్గా ఉండడంలేదు. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం ముందుగానే అప్రమత్తమైతే మేలు. బడిలో వంట చేసే పాత్రలు ఎలా ఉన్నాయో.. సరి చూడాలి. వండిన భోజనాన్ని మొదట ఇద్దరు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు రుచి చూడాలి. వీరు భోజనం రుచి చూసిన తర్వాతనే మిగతా వారికి అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అంది అస్వస్థతకు గురికాకుండా ఉంటారు.
నిధులు పెంచాలి
దౌల్తాబాద్ మండల పరిధిలోనూ మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు అంతంతమాత్రంగానే ప్రభుత్వం ధరలు అందిస్తుంది. మరోవైపు బకాయి బిల్లులు చెల్లింపులకు నోచుకోక నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. దీని ప్రభావం వంట తయారీపై పడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా నిధులు పెంచితే పిల్లలకు నాణ్యమైన భోజనం అందే వీలుంటుంది. ఈ విషయమై ఎంఈఓ వెంకట్‌స్వామిని వివరణ కోరగా ఇప్పటికే బడుల్లో మధ్యాహ్న భోజనంపై పర్యవేక్షణ పెంచామన్నారు. బడుల్లో మెరుగైన మెనూ అమలయ్యేలా ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు.