కబ్జాలు.. దందాలు | - | Sakshi
Sakshi News home page

కబ్జాలు.. దందాలు

Jul 16 2025 9:20 AM | Updated on Jul 16 2025 9:20 AM

కబ్జాలు.. దందాలు

కబ్జాలు.. దందాలు

యథేచ్ఛగా చెరువులు, కుంటలు, దారుల ఆక్రమణ

వికారాబాద్‌: అనుమతులు లేకుండా రిసార్ట్స్‌ను నిర్వహించడమే కాకుండా ప్రాజెక్టు(చెరువులు, కుంటలు)ల్లో అక్రమ బోటింగ్‌ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల వికారాబాద్‌ సమీపంలోని సర్పన్‌పల్లి ప్రాజెక్టులో పడవ బోల్తా పడి ఇద్దరు మహిళలు మృత్యువాత పడటం చర్చనీయాంశమయింది. ఈ ఘటనతో అనేక కొత్త విషయాలు వెలుగు చూశాయి. చెరువులో అక్రమ బోటింగ్‌ తోపాటు బఫర్‌ జోన్‌ను ఆక్రమించారు. పశువులు నీళ్లు తాగేందుకు వెళ్లే పానాదిని కూడా వదల్లేదు. దారిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. అసైన్డ్‌ భూమిలో నిర్మాణాలు చేపట్టడం, చెరువులోకి స్థానికులెవరూ రాకుండా అడ్డుకోవడం లాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఈ విషయాలు వెలుగులోకి రావడంతో కలెక్టర్‌ ఆయా శాఖల అధికారులతో కమిటీ వేసి విచారణకు ఆదేశించారు. వివరాలు సేకరించిన అధికారులు వాటిని బహిర్గతం చేయలేదు. చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా కనిపించలేదు. విచారణ పారదర్శకంగా జరగకుండా కొన్ని శక్తులు ప్రభావితం చూపుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఘటనలు ఒక్క సర్పన్‌పల్లి ప్రాజెక్టులోనే కాదు జిల్లా వ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయి. చాలా మండలాల్లో చెరువులు, కుంటలు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి.

చూసీచూడనట్లుగా..

జిల్లాలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయి. అక్రమా ర్కుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఇటీవల కాలంలో భూముల ధరలు అమాంతం పెరిగిపోవడంతో కబ్జా రాయుళ్ల కన్ను చెరువులు, కుంటలు, నాలాలు, వాగులు, దారులపై పడింది. కొన్ని చోట్ల చెరువులు, కుంటలను ఆక్రమించి పొలాల్లో కలిపేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల కబ్జా చేసిన భూములను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాకుండా చెరువులను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మార్చేస్తున్నారు. అధికారులకు అన్ని విషయాలు తెలిసినా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు.

రికార్డులు తారుమారు

జిల్లాలో మొత్తం 1,196 చెరువులు ఉన్నాయి. గత ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పథకం కింద చెరువు లు, కుంటల్లో పూడిక తీత పనులు చేట్టింది. ఈ సమయంలో ఎక్కడైనా ఆక్రమణలు జరిగినట్లు తేలితే చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లో నీటి పారుదల శాఖ అధికారులు కేవలం పూడిక తీత పనులతోనేసరిపెట్టారు. కబ్జాల జోలికి వెళ్లలేదు. హద్దులు ఏర్పాటు చేయడంపై దృష్టి సారించలేదు. తదనంతర కాలంలో ఆక్రమణలు మరింత పెరిగాయి. చెరువులు, కుంటలు, దారులు, పానాదులు, నాలాల రికార్డులు తరుమారయ్యాయి. రెవెన్యూ, నీటిపారుదల శాఖల వద్ద చాలా చెరువులకు సంబంధించిన రికార్డులు కనిపించడంలేదు. కంచే చేను మేసిన చందంగా అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

ఆక్రమణలు మచ్చుకు కొన్ని..

వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని శివసాగర్‌ చెరువు ఆక్రమణకు గురైంది. నాలుగు వైపులా కబ్జాలకు గురవుతోంది. కొందరు బడా బాబులు ఫాంహౌస్‌లు నిర్మిస్తున్నారు. మరికొందరు చెరువు చివరి భాగాన్ని పూడ్చి వేసి ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు.

ఇదే మున్సిపల్‌ పరిధిలోని కొత్తగడి సమీపంలోని కొంపల్లి చెరువు పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు.

జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న సర్పన్‌పల్లి ప్రాజెక్టుదీ ఇదే పరిస్థితి. కొందరు వ్యాపారులు బఫర్‌ జోన్‌తో పాటు చెరువును పూర్తిగా కబ్జా చేశారు. వ్యాపార కార్యకలాపాలకు వినియోగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చెరువు స్థలంలో కాటేజీలు నిర్మించి అద్దెకు ఇస్తున్నారు.

పరిగి మున్సిపల్‌ పరిధిలోని కొత్త చెరువు పూర్తిగా కబ్జాకు గురైంది. ఫీడర్‌ చానల్‌ను దారిమళ్లించి చెరువులోకి నీరు రాకుండా చేశారు. తూములను ధ్వంసం చేశారు. కట్టను సైతం వదలలేదు. దీన్ని ఆక్రమించి ప్లాట్లు చేసి విక్రయిస్తునారు.

పరిగి పట్టణ పరిధిలోని పల్లవి కళాశాల వెనుక గల మరో చెరువు కూడా పూర్తిగా ఆక్రమణకు గురైంది.

తాండూరు మున్సిపల్‌ పరిధిలోని గొల్ల చెరువు సగానికి పైగా ఆక్రమించారు.

తాజాగా ధారూరు మండలం అల్లాపూర్‌ వద్ద పోతుల వాగును ఓ వ్యక్తి ఆక్రమించి తన పొలంలో కలుపుకొన్నాడు. దాదాపు 30 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అధికారులు తేల్చారు. దీంతో ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీరు కాగ్నా నదిలో కలిసే పరిస్థితి లేకుండా పోయింది.

అనుమతులు లేకుండారిసార్ట్స్‌ల నిర్వహణ

ప్రాజెక్టుల్లో అక్రమ బోటింగ్‌

ప్రజల ప్రాణాలతో చెలగాటం

పట్టించుకోని అధికారులు

జిల్లాలో చెరువులు, కుంటలు, దారులను యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. పంట కాల్వలను కబ్జా చేసి పొలాల్లో కలిపేసుకుంటున్నారు. అనుమతులు లేకుండా రిసార్ట్స్‌ నిర్వహించడమే కాకుండా సమీప ప్రాజెక్టుల్లో అక్రమ బోటింగ్‌ చేస్తూ లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. పడవ ప్రమాదాల్లో ప్రజల ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement