
పింఛను మొత్తం పెంచాల్సిందే
● వచ్చేనెల నుంచి అమలు చేసి తీరాలి ● చేతకాకపోతే సీఎం గద్దె దిగాలి ● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ
అనంతగిరి: ఎన్నికల హామీ మేరకు ఆగస్టు నెల నుంచి ఆసరా, చేయూత పెన్షన్ల మొత్తం పెంచాలని, లేకుంటే సీఎం రేవంత్‌రెడ్డి గద్దె దిగాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం వికారాబాద్‌లోని సత్యభారతి ఫంక్షన్ హాల్‌లో దివ్యాంగుల హక్కుల పోరాట సమితి, చేయూత పెన్షన్ దారుల సంఘం ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్షన్ మొత్తం పెంచుతా మని చెప్పి అధికారంలోకి వచ్చాక హామీని అమలు చేయకపోవడం సరికాదన్నారు. అధికార, ప్రతిపక్షాలకు విమర్శించుకోవడం తప్ప ప్రజల బాధలు పట్టడం లేదన్నారు. దివ్యాంగుల పెన్షన్ మొత్తాన్ని రూ.6 వేలకు, వృద్ధులు, వితంతువుల పెన్షన్‌ను రూ.4వేలకు, కండరాల క్షీణతతో బాధపడుతున్న వారికి రూ.15వేలు ఇవ్వాలనే డిమాండ్‌తో ఆగస్టు 13న హైదరాబాద్‌లో లక్షలాది మందితో మహా ధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఎవ్వరికీ అవసరం లేని అందాల పోటీలు నిర్వహించడానికి ప్రభుత్వం వద్ద నిధులు ఉంటాయి కానీ.. పెన్షన్ మొత్తం పెంచడానికి ఎందుకు ఉండవని ప్రశ్నించారు. నాలుగేళ్ల నుంచి వితంతువులు, వృద్ధులు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య, జిల్లా అధ్యక్షుడు శ్యాంప్రసాద్, మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు పీ ఆనంద్ మాదిగ, జిల్లా ఇన్‌చార్జ్ ప్రశాంత్ మాదిగ, చేయూత పెన్షన్ల జిల్లా కమిటీ అధ్యక్షురాలు మంజుల, మహిళా నాయకురాళ్లు పద్మమ్మ పుష్ప, సునీ త, ఎంఎస్‌పీ జిల్లా ప్రధాన కార్యదర్శి స్వామిదాస్, ప్రధాన కార్యదర్శి సుభాష్ తదితరులు పాల్గొన్నారు.