
భయం గుప్పిట్లో కాలనీలు
● కొడంగల్‌లోని మొచ్చగేరి, కుమ్మరిగేరికి పొంచి ఉన్న ముంపు ముప్పు ● భారీ వర్షాలు కురిస్తే ఇబ్బందులే ● రెండేళ్ల క్రితం తీవ్ర నష్టం
కొడంగల్: పట్టణంలోని బాలాజీనగర్ సమీపంలో గల మొచ్చగేరి, కుమ్మరిగేరి ప్రజలు భయం గుప్పి ట్లో కాలం గడుపుతున్నారు. భారీ వర్షాలు కురిస్తే ఈ రెండు కాలనీల్లోకి వరద నీరు వచ్చే అవకాశం ఉంది. రెండేళ్ల క్రితం అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు తీరని నష్టం జరిగింది. పట్టణ శివారులో చెరువు ఉంది. ఈ చెరువుకు ఉన్న పాటు కాలువ ముచ్చగేరి, కుమ్మరిగేరికి సమీపంలో ఉంది. పాటు కాలువ పొంగి ప్రవహించినా లేక తెగిపోయినా ఈ కాలనీలు మునుగుతాయి. రెండేళ్ల క్రితం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. 93.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొడంగల్ పెద్ద చెరువు పాటు కాలువ పొంగి ప్రవహించింది. దీంతో ఈ కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. నిద్రలో ఉన్న ప్రజలు అర్ధరాత్రి వేళ ఏం చేయాలో తోచక బిత్తరపోయారు. ఇళ్లలోంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. బియ్యం, నిత్యావసర సరుకులతో పాటు టీవీ, ఫ్రిజ్, బీరువా, మంచాలు నీటిలో మునిగాయి. ఇండ్లలో ఉన్న సామగ్రిమొత్తం నీట మునిగింది. బాధితులు కన్నీరు మున్నీరుగా రోదించారు. విషయం తెలుసుకున్న అప్పటి మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి, అప్పటి ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలు బాధితులను పరామర్శించారు. మున్సిపల్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీలు తెప్పించి రోడ్డును తవ్వించారు. వరద నీరు వెళ్లడానికి దారి కల్పించారు. చాలా సేపటి తర్వాత వరద నీరు తగ్గుముఖం పట్టింది. కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగించే కుమ్మరి, మొచ్చ కులస్తులకు రక్షణ కల్పించాలి. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ప్రభుత్వం అండగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు.