
గురుకులాలకు నాణ్యతలేని సన్నబియ్యం
● అన్నంలో పురుగులు ● ఇది ప్రభుత్వ తప్పిదమే ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి
మర్పల్లి: ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలకు నాణ్యత లేని సన్నబియ్యం సరఫరా చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. తరచూ అన్నంలో పురుగులు వస్తున్నాయని, విద్యార్థులు తినలేకపోతున్నారని తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని కేజీబీవీలో భోజనం సరిగ్గా లేదని విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో మండల అధికారులు విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థినులను సముదాయించారు. ఈ విషయం తెలుసుకున్న రాజశేఖర్‌రెడ్డి పార్టీ మండల అధ్యక్షుడు పట్లోళ్ల రామేశ్వర్‌తో కలిసి మంగళవారం పాఠశాలను సందర్శించారు. విద్యార్థినులకు అందుతున్న భోజనంపై ఆరా తీశారు. అనంతరం ఎస్‌ఓ సునీతతో మాట్లాడారు. పాఠశాలకు సన్న బియ్యం సరఫరా కాకపోవడంతో ఐదు రోజుల క్రితం మోమిన్‌పేట్ మండలంలోని వసతి గృహం నుంచి రెండు బస్తాల బియ్యం తెచ్చుకున్నట్లు సునీత తెలిపారు. అవి నాణ్యత లేవని తెలిపారు. పురుగులు వచ్చినట్లు ఒకరిద్దరు విద్యార్థులు తమ దృష్టికి తెచ్చారన్నారు. అనంతరం రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ తప్పిదమే అన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఇకపై విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా కార్యదర్శి మల్లేశ్ యాదవ్, జిల్లా, మండల నాయకులు బలరాంగౌడ్, యాదవరెడ్డి, శ్రీమంత్‌కుమార్, మధు, శేఖర్, సంగమేశ్వర్, రమేష్, శ్రీకాంత్, మహేందర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.