
సమన్వయంతో పని చేయండి
● ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ● కలెక్టరేట్‌లో దిశా కమిటీ సమావేశం
అనంతగిరి: అధికారులు సమన్వయంతో పనిచేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు అందేలా చూడాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దిశ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్య, వైద్యం, గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, బ్యాంకర్లు, పంచాయతీ రాజ్, శిశు సంక్షేమం, పౌర సరఫరాలు, పరిశ్రమలు, పశు సంవర్ధక, వెటర్నరీ, మిషన్ భగీరథ, నేషనల్ హైవే, గృహ నిర్మాణం, మార్కెటింగ్, అటవీ, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ శాఖలు చేపట్టిన పనులపై సమీక్ష చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బ్యాంకర్లు లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద నర్సరీలు, మొక్కల పెంపకం తదితర పనులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 3,815 మందికి వృద్ధాప్య, వితంతు తదితర పెన్షన్లు అందజేస్తున్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం 1.60 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ పథకం కింద రూ.490 కోట్లు అందజేయడం జరిగిందన్నారు. ప్రస్తుత సీజన్‌కు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచామని పేర్కొ న్నారు. పొలాల్లో మట్టి నమూనాల సేకరించి సాయిల్ హెల్త్ కార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. జాతీయ వైద్య కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హార్స్ చౌదరి, డీఆర్‌డీఏ శ్రీనివాస్, దిశ కమిటీ సభ్యులు అంతారం లలిత, మిట్ట పరమేశ్వర్ రెడ్డి, వడ్ల నందు, జానకిరామ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సమాజాన్ని మార్చే శక్తి మీడియాకే ఉంది
సమాజాన్ని మార్చే శక్తి మీడియాకే ఉందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్‌లోని అంబేడ్కర్ భవన్‌లో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వార్తలపై మీడియా వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతికూల వార్తలతోనే కాకుండా సానుకూల వార్తలతో కూడా సమాజంలో మార్పు తీసుకురావచ్చన్నారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా మీడియా పాత్ర ఉండాలన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకరావాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, పీఐబీ డిప్యూటీ డైరెక్టర్ మానస కృష్ణ కాంత్, పీఐబీ ఏడీజీ శృతి పాటిల్, ఎం అండ్ సీఓ శివచరణ్, సీడీఏసీ ప్రాజెక్ట్ మేనేజర్ జగధీష్ బాబు, ఎస్‌బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు విద్యాధర్, శ్రీహరి, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.