
ఫోన్ చోరీ..ఖాతా ఖాళీ
లాటరీ తగిలిందని, మీ కొడుకును కస్టమ్స్ అధికారులు పట్టుకొన్నారని.. ఏదో నేపంతో సైబర్ కేటుగాళ్లు ఉచ్చులోకి లాగి డబ్బులు కాజేస్తున్నారు. అపరిచితుల కాల్స్, వాట్సాప్ లింకులను ఓపెన్ చేయొద్దని పోలీసులు పదేపదే పేర్కొంటున్నా అక్కడక్కడ అమాయకులు మోసపోతున్న ఉదంతాలున్నాయి.
మోమిన్‌పేట: బస్సులు, సంతలలో ఫోన్‌లను చోరీ చేయడం ఆపై డబ్బులు లాగేసుకోవడం ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న కొత్త విధానం. ప్రతిఒక్కరూ డిజిటల్ లావాదేవీలు జరపడంతో కేటుగాళ్లు చోరీల కోసం నూతన దారులు అన్వేషిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మండల సర్కిల్ కార్యాలయ పరిధిలో గడిచిన రెండేళ్లలో 33 ఫిర్యాదు రాగా అందులో 8 కేసులను నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దాదాపు రూ.10,46,883 సొత్తును రికవరీ చేశారు. ఫోన్ పోగొట్టుకొన్న వెంటనే సిమ్‌ను బ్లాకు చేయాలని పోలీసు అధికారులు పదేపదే చెబుతున్నారు. మరోవైపు అమయాకులు ఆన్‌లైన్ గేమ్‌లు, వాట్సాప్‌లో వచ్చే లింక్‌లను ఓపెన్ చేయడంతో బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులు మాయమవుతాయి. అప్పుడు వెంటనే 1930కి కాల్ చేయడంతో మాయమైన నగదు ఓల్డ్‌లో పెడుతారని అధికారులు పేర్కొంటున్నారు.
లబోదిబోమన్న బాధితులు
ఇటీవల మోమిన్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్ రషీద్ విధుల్లో భాగంగా వికారాబార్‌కు వెళ్లాల్సి రావడంతో బస్టాండులో బస్సు ఎక్కాడు. అంతలోనే ఫోన్‌న చోరీకి గురైంది. వెంటనే బ్యాంకులకు సమాచారం అందించడంతో డబ్బులు పోలేదు. కానీ ఈ ఏడాది మార్చి 2వ తేదీన మోమిన్‌పేటకు చెందిన రుద్రశెట్టి శివకుమార్ వికారాబాద్ వెళ్లడానికి బస్టాండులో బస్సు ఎక్కాడు. అంతలోనే ఫోన్ అపహరణకు గురైంది. మరుసటి రోజు బ్యాంకులకు సెలవు ఉండటం, బ్యాంకులకు సమాచారం ఇవ్వాలన్న ఆలోచన కూడా అతనికి తెలీదు. దీంతో ఖాతాలలో నుంచి రూ.1.44 లక్షలు విత్‌డ్రా చేశారు. అదే విధంగా మర్పల్లి గ్రామానికి చెందిన రాజు ఫోన్ పోగొట్టుకోవడంతో ఖాతా నుంచి రూ.10లక్షలు మాయమయ్యాయి. డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన పిన్ నంబరును గుర్తించి డబ్బులను కాజేశారు. లబోదిబోమంటూ వారం రోజులకు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు ఇప్పటికే రూ.68వేలు నిలుపుదల చేశారు. ఇలాంటి కేసుల్లో 8 మంది బాధితులకు డబ్బులను సీఐ వెంకట్ వారి ఖాతాలలో జమ చేయించారు. సైబర్ నేరగాళ్లు ఏ విధంగానైనా డబ్బులు కాజేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటారని పేర్కొన్నారు.
హెచ్చుమీరుతున్న సైబర్ నేరాలు
అమాయకులే లక్ష్యంగా కేటుగాళ్ల కొత్తపంథా
అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన
ఆశ్చర్యానికి గురయ్యా
ఫోన్ చోరీకి గురైందన్న బాధలోనే ఉన్నా. సిమ్‌ను బ్లాక్ చేయించాను. కానీ అప్పటికే ఖాతాలో ఉన్న డబ్బులను కాజేశారు. బ్యాంకులకు సమాచారం ఇవ్వాలనే విషయం తెల్వదు. బ్యాంకులో సురక్షితంగా ఉంటాయని భ్రమపడ్డా. ఫోన్ పోయిన డిజిటల్ లావాదేవీలకు సిక్రెట్ పిన్ ఉంటదిగా అనుకొన్నా. దాన్ని కనుగొన్నారంటే ఆశ్చర్యానికి గురయ్యా. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తిరిగి డబ్బులు వచ్చాయి. – శివకుమార్, బాధితుడు, మోమిన్‌పేట

ఫోన్ చోరీ..ఖాతా ఖాళీ