
అక్రమమని తేల్చినా..
బషీరాబాద్: జుంటివాగు ప్రభుత్వ భూమి కబ్జాపై ఉరుకులు పరుగులు పెట్టిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అంతలోనే నీరసించారు. మాచనూరు రెవెన్యూ పరిధిలోని జుంటివాగు భూమి కబ్జాకు గురైనట్లు ఈ నెల 9న ఇరిగేషన్ డీఈ క్రిష్ణయ్య, యాలాల తహసీల్దార్ వెంకటస్వామి తేల్చిన విషయం విదితమే. ఎంత భూమి కబ్జా అయ్యిందో సర్వే చేసి హద్దులు పాతారు. అయితే ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన సదరు వ్యక్తి అధికారులు పాతిన హద్దులను సోమవారం చెరిపేశాడు. అలాగే కబ్జా చేసిన 20 గుంటల ప్రభుత్వ భూమిలో గదుల నిర్మాణం కూల్చివేయాలని అధికారులు ఆదేశించినా పట్టించుకోకుండా పనులు కొనసాగిస్తున్నాడు. సదరు భూ కబ్జాదారుపై అధికారులు చర్యలకు వెనకడుగు వేశారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
● కొనసాగుతున్న నిర్మాణం
● కబ్జాదారు బరితెగింపు