అనుమతులకు మించి తవ్వకాలు
పరిగి/దోమ: అనుమతులకు మించి అక్రమ మైనింగ్ తవ్వకాలు జరిపిన సాయి కృష్ణ స్టోన్ క్రషర్స్‌పై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు శనివారం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. పలువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు క్రషర్‌లో పనిచేస్తున్న ఆరుగురిని రిమాండ్‌కు తరలించారు. పరిగి సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. దోమ మండలం దిర్సంపల్లి శివారులో సర్వే నంబర్ 173లో దోమ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు, కిష్టాపూర్‌కు చెందిన నాగిరెడ్డి పది ఎకరాలకు లీజు తీసుకుని మైనింగ్ నిర్వహిస్తున్నాడు. అనుమతులకు మించి తవ్వకాలు చేపట్టినట్లు ఫిర్యాదులు అందడంతో మే 21న సర్వే చేసిన అధికారులు 1.1 ఎకరాల్లో అదనంగా తవ్వకాలు జరిపి రూ.2కోట్ల వరకు ఆర్జించినట్లు గుర్తించారు. మే 31న తాండూర్ అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ అధికారి సత్యనారాయణ, దోమ డిప్యూటీ తహసీల్దార్ పోలీసు సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆందోళన చెందిన క్రషర్ నిర్వాహకుడు రాత్రికి రాత్రే తవ్వకాలు జరిపిన చోట పూడ్చేందుకు యత్నించాడు. ఈ క్రమంలో మూడు హిటాచీలు, ఓ ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. డిప్యూటీ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు క్రషర్ యజమాని కొప్పల నాగిరెడ్డి, ఇతరులపై కేసు నమోదు చేశారు. క్వారీలో పనిచేస్తున్న శ్రీశైలం, సుజిత్‌కుమార్ మెహతా, ఎండీ ఆజాద్, ప్రకాశ్‌కుమార్, సురేశ్‌సింగ్, రామకృష్ణను రిమాండ్‌కు తరలించామన్నారు. నాగిరెడ్డితో పాటు పలువురు పరారీలో ఉన్నారని వారి జాడకోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో దోమ ఎస్‌ఐ ఆనంద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీటీసీ మాజీ సభ్యుడిపై కేసు
ఆరుగురికి రిమాండ్
వివరాలు వెల్లడించిన పరిగి సీఐ శ్రీనివాస్‌రెడ్డి
అనుమతులకు మించి తవ్వకాలు


