వైభవంగా భద్రేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
తాండూరు టౌన్: శ్రీభావిగి భద్రేశ్వర జాతర బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ అధ్యక్షుడు పటేల్ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఉత్సవాలకు నాయకులు ప్రజా ప్రతినిధులు భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వందలాది మంది భక్తుల సమక్షంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో శోభయాత్ర నిర్వహించారు. పురంతయ్యల విన్యాసాలు, విద్యార్థుల నృత్యాల మధ్య కోలాహలంగా మొదటి రోజు నిర్వహించారు. మొదటి రోజు ఆలయం నుంచి గాంధీచౌక్, రాచన్న దేవాలయం వరకు పల్లకీ సేవ నిర్వహించారు. వీరశైవ సమాజం సభ్యులు పెద్ద ఎత్తున చేరుకొని ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలలో తాండూరు పట్టణ సీఐ సంతోశ్ శాంతి భద్రతలను పర్యవేక్షించారు.


