వాహనంలో మహిళకు ప్రసవం చేసిన ఈఎంటీ (ఫైల్)
కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడి ప్రతిరూపంగా, ప్రమాదం సంభవించినప్పుడు 108 వాహన సిబ్బంది ఆదుకుంటున్నారు. ఇందులో పనిచేసే ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తూ ఇప్పటి వరకు వేల సంఖ్యలో ప్రాణాలు కాపాడారు. వాహనంలో పనిచేసేందుకు దేవుడు ఇచ్చిన వరంలా సిబ్బంది భావిస్తున్నారు. అప్రమత్తతతో ఎక్కడ ప్రమాదం జరిగినా మెరుపు వేగంతో సంఘటనా స్థలానికి చేరుకొని సమీపంలోని ఆస్పత్రికి క్షతగాత్రులను తరలిస్తూ ప్రాణాలను కాపాడేందుకు కృషి చేస్తున్న సిబ్బందికి బాధిత కుటుంబ సభ్యులు అభినందనలు తెలుపుతున్నారు.
కొడంగల్ రూరల్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా ఎక్కడ, ఎప్పుడు ప్రమాదం జరిగినా అత్యవసరంగా ఘటనా స్థలికి వెళ్లి ప్రాణాలను రక్షించడానికి 108 సిబ్బంది కృషిచేస్తున్నారు. సంఘటనా స్థలంలోనే క్షతగాత్రులకు రక్తస్రావం ఎక్కువ కాకుండా అవసరమైతే ప్రథమ చికిత్స అందిస్తున్నారు. సమీపంలోని ఆస్పత్రులకు తరలించేందుకు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్(ఈఎంటీ)లు కృషిచేస్తున్నారు. అంబులెన్స్‌లో ఆక్సిజన్ సౌకర్యం, డెలివరీ కిట్, ఎవరైనా పురుగు మందు తాగితే వారిని కాపాడడానికి కావాల్సిన పరికరాలతో ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో 18 మండలాల పరిధిలో 12వాహనాలున్నాయి. ఈ క్రమంలో గతేడాది జనవరిలో 1025, ఫిబ్రవరిలో 1235, మార్చిలో 1130, ఏప్రిల్‌లో 1088, మేలో 1120, జూన్‌లో 1205, జులైలో 1308, ఆగష్టులో 1209, సెప్టెంబర్‌లో 1320, అక్టోబర్‌లో 1250, నవంబర్‌లో 1075, డిసెంబర్‌లో 1130లతో మొత్తం 14,095 కేసులను 108వాహన సిబ్బంది ఆస్పత్రులకు తరలిస్తూ చికిత్స అందించారు. వీరిలో ఎంతో మంది ప్రాణాలు కాపాడుతూ ఆపద్భాందవులుగా నిలుస్తున్నారు.
క్షతగాత్రులను తరలిస్తూ..
108లో ఉద్యోగం చేయడం ఆనందంగా ఉంది. ప్రమాదాలు జరిగిన సమయంలో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తూ ప్రాణాలు కాపాడడంతో ఎంతో పుణ్యంగా భావిస్తున్నాను. బాధితులు ఓ వైపు బాధపడుతూనే మమ్మల్ని అభినందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రాణాలు కాపాడిన సంఘటనలు జీవితంలో గుర్తుండిపోతాయి.
– అశోక్, ఈఎంటీ, కొడంగల్
ప్రమాదం సమయంలో ఈఎంటీల సేవలు కీలకం
ఎంతో మంది ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది


