మెరుగైన వైద్యం పేరుతో పెరుగుతున్న రెఫరల్ కల్చర్ ఇక్కడ నిపుణులైన వైద్యులు లేరా? ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందే వైద్యం స్విమ్స్‌లో దొరకదా!
స్విమ్స్‌లో ప్రపంచ స్థాయి వైద్యం అందిస్తామంటూ టీటీడీ ఉన్నతాధికారులు తరచూ చెప్పడం ఉత్తుత్తి ప్రగల్భాలేనా? .. స్విమ్స్ వైద్యంపై టీటీడీకే నమ్మకం సన్నగిల్లుతోందా..? ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి వైద్యం అందించగలుగుతామన్న నమ్మకం వైద్యుల్లో లోపించిందా?..
పాముకాటుకు గురైనా.. ఏనుగుదాడిలో గాయపడినా చికిత్స చేయలేమంటూ వైద్యులు తప్పించుకుంటున్నారా..? అంటే స్థానికుల నుంచి
అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలను పరిశీలిస్తే దీనికి మరింత బలాన్ని చేకూర్చుతోంది.
తిరుపతి తుడా: టీటీడీ ఏటా కోట్లు వెచ్చించి స్విమ్స్ ఆస్పత్రిని నిర్వహిస్తోంది. భక్తులు సమర్పించే కానుకల్లో నుంచి వందలాది కోట్లు ఖర్చు చేస్తున్నా స్విమ్స్‌లో వైద్యం మెరుగుపడడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యధునిక వైద్య పరికరాలు, అవసరమైన వైద్యులు, వైద్య సిబ్బంది, అవసరానికి మించి ఇన్ఫాస్ట్రక్చర్ ఉన్నా వైద్యం విషయంలోకి వచ్చే సరికి ఆ స్థాయిలో జరగడం లేదన్న నిజం టీటీడీ అధికారుల్లోనూ వ్యక్తమవుతోంది. టీటీడీ అధికారులు, పాలక వర్గం, చివరికి ఉద్యోగులు అనారోగ్యానికి గురైనా మెరుగైన వైద్యం కోసం పొరుగు రాష్ట్రాల వైపు చూడడమే ఇందుకు నిదర్శనంగా మారుతోంది. టీటీడీ ఉద్యోగులకు క్యాష్ లెస్ వైద్యం ప్రకటించిన క్రమంలో స్విమ్స్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక తెలంగాణలోని ప్రముఖ ఆసుపత్రుల్లోనూ క్యాష్ లెస్ వైద్యం కావాలంటూ ఉద్యోగ సంఘం నేతలు డిమాండ్ చేసి సాధించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అధికారులు, ఉద్యోగులు సైతం వైద్యం కోసం తమ సొంత ప్రతిష్టాత్మక స్విమ్స్‌ను కాదని చైన్నె, బెంగళూరుకు పరుగులు తీస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తులు తీవ్ర అనారోగ్యానికి గురైనా, ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డా స్విమ్స్‌లో అత్యవసర వైద్యం ముగించుకుని, ఇక ఇక్కడి వైద్యం మాకు వద్దు మహాప్రభో అంటూ బంధువులు గంటల వ్యవధిలోనే తీసుకెళ్లిన ఘటనలు అనేకం. ఇలాంటి ఘటనలు చూసినప్పుడల్లా స్విమ్స్ వైద్యంపై నమ్మకం సన్నగిల్లక తప్పడం లేదు.
ఆత్మ పరిశీలన అవసరం
టీటీడీ అధికారులు, ఉద్యోగులు, అనారోగ్యం పాలైన భక్తులకు సైతం స్విమ్స్ వైద్యం తమకు వద్దంటూ పొరుగు రాష్ట్రాలకు పరుగులు పెట్టడంపై స్విమ్స్ అధికారులు, అలానే స్విమ్స్‌కు కోట్లు వెచ్చించి నిర్వహిస్తున్న టీటీడీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్విమ్స్ అత్యవసర విభాగానికి వెళితే ప్రాణాలతో తిరిగొస్తామా అనే అనుమానాలు సర్వత్రా వినిపిస్తుంటాయి. రోగుల్లో ఇలాంటి అనుమానాలు విస్తృతం కాకముందే స్విమ్స్ వైద్యాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
స్విమ్స్‌పై నమ్మకం సన్నగిల్లుతోందా?
భాస్కర్ నాయుడుకు ప్రైవేటు వైద్యం
తిరుమల యాత్రికుల సముదాయంలోకి వచ్చే పాములను పట్టి అడవిలో వదిలిపెట్టేందుకు టీటీడీలో ఉద్యోగిగా భాస్కర్ నాయుడు సుదీర్ఘంగా సేవలందించారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం ఆయన పాము కాటుకు గురయ్యాడు. కొన్ని రోజులపాటు ఆయనకు స్విమ్స్‌లోనే వైద్యం అందించారు. ఇక్కడి వైద్యులు చేతులెత్తేయడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించడం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. పాము కాటుకు గురైన వ్యక్తికి కూడా స్విమ్స్‌లో వైద్యం అందదా..? అనే అనుమానాలు వెల్లువెత్తాయి. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలన్న ఉన్నతాధికారుల నిర్ణయం సైతం ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఇటీవల ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడ్డ చంద్రశేఖర్‌కు తొలుత స్విమ్స్‌లో వైద్యం అందించారు. ఆ తర్వాత క్రిటికల్‌గా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం చైన్నెకి తరలించాలని భావించారు. చైన్నెకి తరలించే క్రమంలో గుండె ఆగిపోవడం.. సకాలంలో సీపీఆర్ ద్వారా గుండెను సాధారణ స్థితికి తీసుకురావడం చకాచకా జరిగిపోయింది. అంబులెన్‌న్స్‌లోనే తిరిగి తీసుకువచ్చి వైద్యాన్ని కొనసాగించారు. మెరుగైన వైద్యం కోసం చైన్నె, హైదరాబాద్‌లోని ప్రముఖ వైద్య నిపుణులను రప్పించి వైద్యం అందించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఆయన దురదృష్ట వశాత్తు తుదిశ్వాస విడిచారు. కాగా పక్క రాష్ట్రాల నుంచి నిపుణులైన వైద్యులను దిగుమతి చేసుకోవడం ఏమిటి..? సిమ్స్‌లో అంతటి నిపుణులు లేరా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురైనా, తిరుమలలో అస్వస్థతకు గురైనా, పాము కాటుకు గురైనా మెరుగైన వైద్యం కోసం పొరుగు రాష్ట్రాలకు, స్థానిక ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫరల్ చేసే సంస్కృతి ఇటీవల స్విమ్స్ అధికారుల్లో ఎక్కువైంది.


