తిరుపతి మంగళం : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా తిరుపతికి చెందిన నీలం బాలాజీ నియమితులయ్యారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఉన్న నీలం బాలాజీని పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది.
తిరుమలలో
కొనసాగుతున్న భక్తుల రద్దీ
సాక్షి, తిరుపతి: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 26 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 78,777 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,244 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.4.35 కోట్ల ఆదాయం సమకూరింది. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.
మెడికల్ ధ్రువీకరణ తప్పనిసరి
తిరుపతి ఎడ్యుకేషన్ : నూతన జిల్లాల పునర్విభజన ఉత్తర్వులు మేరకు ప్రిఫరెన్షియల్ కేటగిరి/స్పెషల్ పాయింట్లు పొందేందుకు మెడికల్ ధ్రువీకరణ తప్పనిసరి అని డీఈఓ కేవీఎన్.కుమార్ తెలిపారు. ఈ పాయింట్లు పొందేందుకు తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల పరిధిలో పనిచేస్తున్న అర్హులైన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది తప్పనిసరిగా మెడికల్ క్యాంపునకు హాజరై ధ్రువపత్రాలను వైద్యపరంగా ధ్రువీకరించుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా ఈ నెల 9న తిరుపతి డివిజన్, 12న పుత్తూరు డివిజన్, 13న మదనపల్లి డివిజన్, 14న చిత్తూరు డివిజన్ పరిధిలో పనిచేస్తున్న వారు ఆయా తేదీల్లో తిరుపతి రుయా ఆసుపత్రిలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటల వరకు నిర్వహించే మెడికల్ క్యాంపునకు హాజరు కావాలని ఆయన సూచించారు.
బియ్యం పంపిణీలో
సాంకేతిక సమస్యలు
తిరుపతి అర్బన్: చౌకదుకాణాల నుంచి కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయడంలో పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో కార్డుదారులు సకాలంలో బియ్యం పొందలేకపోతున్నారు. ప్రధానంగా క్యూఆర్ కోడ్‌తో కూడిన బియ్యం బస్తాలు రేషన్ డీలర్లకు తోలాల్సి ఉంది. అయితే 65 శాతం క్యూఆర్ కోర్ ఉన్న బస్తాలు, 35 శాతం క్యూఆర్ కోడ్ లేని బస్తాలు డీలర్లుకు అందించారు. క్యూఆర్ కోడ్ ఉన్న బస్తాలు సైతం ఈ–పోస్ యంత్రాలు సక్రమంగా తీసుకోకపోవడంతో ప్రతి బస్తా విషయంలో ఇబ్బందులు పడ్డారు. అలాగే క్యూఆర్ కోడ్ లేని బస్తాలను పంపిణీ చేయకుండా రెండు రోజుల పాటు నిలుపుదల చేశారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల అనంతరం స్కానింగ్ లేకుండా క్యూఆర్ కోడ్ బస్తాలను పంపినీ చేస్తారు.
దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి సిటీ: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.శ్రీనివాసులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువతను గుర్తించి ఆయా ప్రాంతాలలో గల పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాలకు అనుగుణంగా శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంటర్, ఐటీఐ అర్హతగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిక్షణకోసం అభ్యర్థులు ఈనెల 25లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 8143576866 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
రేపటి నుంచి దసరా సెలవులు
తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్, డిగ్రీ కళాశాలలకు, యూనివర్సిటీలకు శనివారం నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. వాస్తవంగా 12 నుంచి ఈనెల 20వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. 21వ తేదీన కళాశాలలు యథావిధిగా తెరుచుకోనున్నాయి. కాగా రెండో శనివారం, ఆదివారం కలిసి రావడంతో శనివారం నుంచి కళాశాలలు మూతపడనున్నాయి.


