తిరుపతి రూరల్: నక్షత్రాలు.. గ్రహాలు.. అంతరిక్ష అద్భుతాలను ఇక నేరుగా వీక్షించే అవకాశం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థినులకు అందుబాటులోకి వచ్చింది. విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన పద్మావతి స్పేస్ అబ్జర్వేటరీని కాకినాడ జేఎన్‌టీయూ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ సి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ గురువారం ప్రారంభించారు. సావేరి అతిథి గృహ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ వి.ఉమ పాల్గొన్నారు. అబ్జర్వేటరీలో టెలిస్కోపులు, బైనాక్యులర్లు, వాటికి సంబంధించిన స్టాండ్లు తదితర అంతరిక్ష పరిశీలనా పరికరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా విద్యార్థినులు రాత్రి ఆకాశాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడంతోపాటు ఖగోళశాస్త్రంపై అధ్యయనం, ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు అవకాశం కల్పించనున్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు విజయలక్ష్మి, సుధ, భవానీకుమార్ ఎల్లాప్రగడ, వెంకటకృష్ణ, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్, ప్రొఫెసర్ మల్లికార్జున పాల్గొన్నారు.


