యధేచ్ఛగా కొండలను కొల్లగొడుతున్న పచ్చ ముఠా
తిరుపతి కేంద్రంగా టీడీపీ ప్రముఖుల ఇసుక దందా
అక్రమార్కుల నుంచి కప్పం వసూలు
సిండికేట్ ఉచ్చులో సైదాపురం
మైనింగ్ పరిశ్రమ
20 నుంచి 30శాతం వరకు
అనధికారికంగా రాయల్టీ చెల్లింపు
జిల్లాలో రెండున్నరేళ్లుగా టీడీపీ నేతలు భూగర్భ గనుల దోపిడీకి యథేచ్చగా పాల్పడుతున్నారు. సంపాదనే లక్ష్యంగా చంద్రబాబు సర్కార్‌లోని ప్రముఖ నాయకులు, అధికారులు కుమ్మకై ్క ఇసుక, మట్టి, గ్రావెల్, కంకరను విచ్చలవిడిగా తవ్వి తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. తిరుపతి కేంద్రంగా ఇసుక దందాను మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగిస్తున్నారు. నదులు, కాలువల్లోని ఇసుకను తవ్వి వెంకటగిరిలో డంప్ చేసుకుని.. వివిధ ప్రాంతాల్లో భవన నిర్మాణాలకు విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. జిల్లాలో అక్రమార్కుల ఆగడాలపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.
చంద్రగిరి నియోజకవర్గం
సి.రామాపురం వద్ద కొండను సైతం తవ్వేసిన దృశ్యం
సాక్షి ప్రతినిధి, తిరుపతి : జిల్లాలోని ప్రకృతి వనరులను టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. అధికారమే అండగా అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఉన్నతాధికారులను సైతం గుప్పిట్లో పెట్టుకుని దందా నడిపిస్తున్నారు.
‘స్వర్ణమ్మ’ కరిగిపోయింది
శ్రీకాళహస్తి, నాయుడుపేట ప్రాంతాల్లో స్వర్ణముఖి నదిలోని ఇసుకను తవ్వి తమిళనాడుకు తరలిస్తున్నారు. చైన్నె నగరంలో స్వర్ణముఖి నది ఇసుకకు మంచి డిమాండ్ ఉండడంతో టీడీపీ నేతలు అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నారు. నాయుడుపేట మండలంలోని చిగురుపాడు సమీపంలో స్వర్ణముఖినది వద్ద జిల్లా మైనింగ్ అధికారులు ఏర్పాటు చేసిన అడ్డుకట్టను తొలగించి, పొర్లు కట్టలను ధ్వంసం చేసి ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. అలాగే పెళ్లకూరు మండలంలోని రావులపాడుసమీపంలో భారీ స్థాయిలో మట్టి తవ్వేసి వ్యాపారం చేస్తున్నారు. మరో వైపు మట్టి, గ్రావెల్ కోసం కొండలు, చెరువుల్లో భారీ యంత్రాలతో తవ్వకాలు చేపడుతున్నారు. అడ్డుకునేందుకు యత్నించిన వైఎస్సార్‌సీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేసి పలుమార్లు అరెస్టు చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే.
ఆధ్యాత్మిక నగరం చుట్టూ అక్రమాలు
తిరుపతి నగరానికి పక్కనే ఉన్న చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో విచ్చలవిడిగా ఇసుక, మట్టి, గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. రామచంద్రాపురం మండలం అనుప్పల్లి, సి రామాపురంలో మట్టి తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. కొండలను కొట్టి ఆ మట్టి, గ్రావెల్‌ని రియల్ ఎస్టేట్ వెంచర్లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. తిరుపతి రూరల్ మండలం పేరూరు చెరువు, దళవాయి చెరువులోని మట్టిని తవ్వి ఇటుక బట్టీలకు విక్రయించి కాసులు మూటగట్టుకుంటున్నారు. చంద్రగిరి మండలంలోని నరసింగాపురం సమీపంలో పత్తిగుట్టను తవ్వి మట్టిని ప్రైవేటు వెంచర్లకు తరలిస్తున్నారు. స్వర్ణముఖి నది పరీవాహక ప్రాంతాల్లో ఇసుకను యథేచ్చగా తవ్వి తరలించేస్తున్నారు.
సైదాపురం మైనింగ్‌లో సిండి‘కేట్లు’
వెంకటగిరి నియోజక వర్గంలోని సైదాపురంలో ఉన్న గనులకు సిండికేట్ల కారణంగా పరిశ్రమ విలవిలలాడిపోతోంది. గడిచిన 27 నెలలుగా మైనింగ్ పరిశ్రమపై వివిధ ఆంక్షలు పెడుతూ వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చివరకు ఓ ముఖ్యనేతకు మైనింగ్ పరిశ్రమను అప్పనంగా అప్పగించేశారు. సిండికేట్‌కు కప్పం కడితే ఖనిజాన్ని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చేస్తు్‌ాన్నరు. ఎన్నడూ లేని విధంగా ఖనిజ విలువలో 20శాతం నుంచి 30 శాతం వరకు వసూలు చేసుకుని తమ జేబులను నింపుకుంటున్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో 140 మైకా, క్వార్ట్జ్ గనులున్నాయి. వీటిపై డిపెండెంట్ ఇండసీ్త్రస్ కూడా మరో 100కి పైగా నడుస్తున్నాయి. ఈ యూనిట్లు ముడి ఖనిజంపై ఆధారపడుతున్నాయి. పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మంది కూలీలు జీవనోపాధి పొందుతున్నారు. వీరికి సిండికేట్ల దెబ్బతో కూలీలు తరచూ పనులు లేక కుటుంబపోషణ భారమై తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నాయుడుపేటటౌన్ : మండలంలోని పూడేరు వద్ద అటవీభూముల్లో భారీగా గ్రావెల్ తవ్వకాలు సాగుతున్నాయి. టీడీపీ నేతల అండతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా దందా సాగిస్తున్నారు. స్థానిక అధికారులను మామూళ్ల మత్తులో ముంచి కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతర్ చేస్తున్నారు. భారీ యంత్రాలతో మట్టి, గ్రావెల్ తవ్వేసి టిప్పర్లతో తరలించి అమ్మేస్తున్నారు. మేనకూరు సెజ్ పరిధిలోని భూములు, పలు చెరువులను అక్రమార్కులు ధ్వంసం చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పూడేరు వీఆర్‌ఓ వెంకయ్య ఆదివారం అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు యత్నించినా అక్రమార్కులు లెక్కచేలేదు. దీంతో వీఆర్‌ఓ వెంటనే తహసీల్దార్‌కు సైతం ఫిర్యాదు చేశారు. దీనిపై తహసీల్దార్ స్పందించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
సైదాపురంలో మైకా, క్వార్ట్జ్ గనులు
పూడేరులో భారీగా తవ్వకాలు
జిల్లాలో ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలు
ఏ ముఖం పెట్టుకుని వెళతాం
పూడేరు వద్ద భారీ యంత్రాలతో తవ్వేస్తున్నారు. ప్రభుత్వ భూములను గుంతలమయంగా మార్చేస్తున్నారు. టీడీపీ నేతల అండదండలతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని స్థానికంగా చర్చసాగుతోంది. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. ఇలాంటి దందా సాగిస్తూ ఏం ముఖం పెట్టుకుని ప్రజల్లో వెళతాం. ఏమని ఓట్లు అడగాలో అర్థం కావడం లేదు. – బత్తల నవీన్, టీడీపీ నేత, పూడేరు


