సిగపట్లకు సిద్ధం! | - | Sakshi
Sakshi News home page

సిగపట్లకు సిద్ధం!

Oct 5 2026 12:51 AM | Updated on Oct 5 2026 12:51 AM

మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో సై అంటే సై

టీడీపీ సీట్లు కేటాయించేది ఏంటి?

మేమే పోటీ చేస్తాం

అడిగినన్ని డివిజన్లు, మేయర్‌, చైర్మన్‌ స్థానాలు ఇవ్వాల్సిందే

తెగేసి చెబుతున్న జనసేన శ్రేణులు..

ఆ దిశగా అడుగులు

తిరుపతి మేయర్‌, డివిజన్లలో

పోటీకి బీజేపీ సన్నాహాలు

కూటమి పార్టీల్లో నాయకుల మధ్య ‘స్థానిక’ చిచ్చు రాజుకుంటోంది. మేయర్‌, చైర్మన్‌, డివిజన్‌, వార్డుల కోసం పోటీ పెరిగింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సీట్ల శాతం జనసేన శ్రేణుల ఆశలపై నీళ్లు చల్లింది. టీడీపీ అధినేత ప్రకటించిన 15 శాతం సీట్లకు ఒప్పుకోమని.. 30 శాతం కావాలని జనసేన శ్రేణులు పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ సైతం తన వ్యూహాలకు పదును పెడుతోంది.

సాక్షి ప్రతినిధి, తిరుపతి : జిల్లా కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు మధ్య స్థానిక ఎన్నికల కాక రేగుతోంది. మేయర్‌, చైర్మన్‌, కార్పొరేటర్‌, కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ఎవరికి వారు సిద్ధమవుతున్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి, పుత్తూరులో జనసేన నేతలు మేయర్‌, చైర్మన్‌ అభ్యర్థులను కూడా ఎంపిక చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే రిజర్వేషన్లు ప్రకటించాక బహిరంగ పరచాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఆ మేరకు అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తిరుపతి నగరంలో డివిజన్లు 66కు చేరడంతో జనసేన నేతలు ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. కార్పొరేటర్లతో పాటు మేయర్‌ పదవి కూడా జనసేనకే కావాలని డిమాండ్‌ చేస్తున్నట్లు నగరంలో జోరుగా ప్రచారం సాగుతోంది. 15శాతం డివిజన్లు కాదని, 30 శాతం కావాలని పట్టుబడుతున్నారు. అదే విధంగా బీజేపీ కూడా తిరుపతి నగరంలో పోటీ చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా ఆదివారం బీజేపీ నేతలు సమావేశమయ్యారు. ఈ మేరకు కూటమిలోని మూడు పార్టీలు నువ్వా నేనా అంటూ బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.

కూటమిలో స్థానిక ఎన్నికల చిచ్చు

అన్ని చోట్లా.. నిరూపించుకోవాల్సిందే..

తిరుపతిలోనే కాదు.. మున్సిపాలిటీల్లోనూ తమ బలమేంటో నిరూపించుకోవాల్సిందేనని జనసేన, బీజేపీ నేతలు నిర్ణయించుకున్నారు. టీడీపీ నేతలు చెప్పినట్లు వినటానికి సిద్ధంగా లేమని స్థానిక ఎన్నికల్లో నిరూపించుకోవాలని జనసేన, బీజేపీ శ్రేణులు గట్టిగా భావిస్తున్నాయి. శ్రీకాళహస్తిలోనూ జనసేన, బీజేపీ బలమేమిటో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి తెలియజేయాలని ఆ పార్టీ శ్రేణులు నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎన్నికల్లో బలమేమిటో నిరూపించుకుంటే.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసేందుకు మార్గం సుగమం అవుతుందనే ఆలోచనలో జనసేన, బీజేపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది, ఇదిలా ఉంటే.. జనసేన నగరి నియోజకవర్గ ఇన్‌చార్జి మెరుపుల మహేష్‌ పుత్తూరు మున్సిపాలిటీ చైర్మన్‌ పదవి కోసం పోటీపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పుత్తూరు మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా తమ వారిని బరిలోకి దింపేందుకు బీజేపీ, జనసేన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు అధిష్టానానికి సమాచారం కూడా ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా కూటమిలోని మూడు పార్టీలు.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరికి వారు ఏర్పాట్లు చేసుకుంటూ ఉండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement