నేటి నుంచి బీఈడీ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్‌ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి బీఈడీ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్‌

Oct 5 2026 12:51 AM | Updated on Oct 5 2026 12:51 AM

తిరుపతి సిటీ: ఏపీ ఎడ్‌సెట్‌–2026 కౌన్సెలింగ్‌లో భాగంగా బీఈడీ కోర్సులో తొలివిడత ప్రవేశాలకు సోమవారం నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు కమిషనరేట్‌ ఆఫ్‌ హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అధికారులు ఒక ప్రటనలో తెలిపారు. ఎడ్‌సెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఈనెల 12 తేదీలోపు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. మూడు నెలలుగా బీఈడీ ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు కాస్త ఊరట లభించింది.

నేడు కలెక్టరేట్‌లో ‘గ్రీవెన్స్‌’

తిరుపతి అర్బన్‌ : కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్‌ఎస్‌ (గ్రీవెన్స్‌) నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదివారం తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అర్జీలు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఒకసారి పీజీఆర్‌ఎస్‌లో అర్జీ ఇచ్చిన వారు మళ్లీ ఇవ్వాల్సిన పనిలేదని..మీ వద్ద ఉన్న రశీదును చూపిస్తే సరిపోతుందని చెప్పారు. అలాగే మీ అర్జీ స్టేటస్‌ తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు కాల్‌ చేయవచ్చన్నారు. అలాగే మీకోసం డాట్‌ ఏపీ డాట్‌ జీఓవీడాట్‌ ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా మీ సమస్యను తెలియజేయవచ్చునని తెలిపారు. కలెక్టరేట్‌ వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్‌ కోడ్‌ ద్వారా కూడా మీ సమస్యను వెల్లడించే సౌకర్యం ఉందని వివరించారు.. ప్రతి అర్జీకి పరిష్కారం చూపించే దిశగా అధికారులు చొరవ చూపాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లోనే కాకుండా మండల, డివిజన్‌ స్థాయిలోను పీజీఆర్‌ఎస్‌ ఉంటుందని వెల్లడించారు. చిన్న సమస్యల కోసం మండల కేంద్రంలోని అధికారులను సంప్రదించాలని సూచించారు.

ఘనంగా సంజ్ఞా భాషా దినోత్సవం

తిరుపతి అర్బన్‌ : కలెక్టరేట్‌లో ఆదివారం అంతర్జాతీయ సంజ్ఞా భాషా దినోత్సవం నిర్వహించా రు. విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు పుల్లారెడ్డి ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేశారు. సంజ్ఞా భాషలో ప్రత్యేక గుర్తింపు సాధించిన పలువురు ప్రముఖులను గుర్తుచేసుకున్నారు. అధికారులు గంఽగాధరం, రవణప్ప, కృష్ణారెడ్డి, నేతలు మనోజ్‌కుమార్‌, రెడ్డెప్ప, నిర్మల, ధనంజయులు, కల్యాణ్‌చక్రవర్తి, బాబు పాల్గొన్నారు.

ఫార్మా కంపెనీపై కేసు

వరదయ్యపాళెం: శ్రీసిటీలోని టాబ్లెట్స్‌ ఇండియా ఫార్మా పరిశ్రమలో శుక్రవారం జరిగిన బాయిలర్‌ పేలుడు ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ప్రాథమికంగా కేసు నమో దు చేశారు. ప్రమాదానికి గల కారణాలు, నిర్వహణలో లోపాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బాయిలర్ల శాఖ, ఫ్యాక్టరీల శాఖ అధికారుల నివేదిక ఆధారంగా తదుపరి సెక్షన్లు జోడించే అవకాశం ఉందని శ్రీసిటీ హైటెక్‌ పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీ బీవీ శ్రీనివాసులు తెలిపారు.

శ్రీవారి దర్శనానికి 18 గంటలు

తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరింది.శనివారం అర్ధరాత్రి వరకు 91,296 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 32,805 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.5.06 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

యూటీఎఫ్‌ సేవలు అభినందనీయం

తిరుపతి ఎడ్యుకేషన్‌ :ప్రభుత్వ బడుల బలోపేతానికి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యూటీఎఫ్‌) సేవలు అభినందనీయమని డీఈఓ కేవీఎన్‌ కుమార్‌ తెలిపారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్‌లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ప్రదానం చేశారు. డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు యూటీఎఫ్‌ కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరచిన వంద మంది ఉపాధ్యాయులను పురస్కారాలను అందజేశారు. పుత్తూరు డీవైఈఓ టి.మహేశ్వరరావు, తిరుపతి అర్బన్‌ ఎంఈఓలు బాలాజీఈ, భాస్కర్‌నాయక్‌, యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఎస్‌.నాయుడు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజశేఖర్‌, ముత్యాలరెడ్డి, నేతలు దండు రామచంద్రయ్య, కుమారస్వామి, గీతమ్మ, డి.నిర్మల, మధు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement